Postal Ballot Voting :అధికారులు అయోమయ ఆదేశాలు, ఉద్యోగుల గందరగోళం మధ్య రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 5వ తేదీ నుంచి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని ఈసీ ప్రకటించగా చాలా జిల్లాల్లో 4వ తేదీ నుంచే పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను అధికారులు ప్రారంభించేశారు. ఈ అంశంపై స్పష్టమైన ఆదేశాలు కొరవడటంతో ఒక్కో జిల్లాలో ఒక్కో తరహాలో ఈ ప్రక్రియను చేపట్టడం వివాదాస్పదమవుతోంది.
మొత్తంగా ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు 3.30 లక్షల మంది అని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం చెబుతోంది. వీరిలో ఎంత మందికి ఫాం 12 జారీ చేశారు. ఎంతమందికి పోస్టల్ బ్యాలెట్లు కేటాయించారన్న దానిపై ఎన్నికల సంఘం వద్దే పూర్తి స్థాయి వివరాలు లేని పరిస్థితి నెలకొంది. దురుద్దేశపూర్వకంగా కొన్నిచోట్ల జిల్లా కలెక్టర్లు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ కొందరికే పోస్టల్ బ్యాలెట్లు కేటాయించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈసీ చర్యలు చేపట్టాలని డిమాండ్ : మరోవైపు ఏప్రిల్ 30వ తేదీన ఎన్నికల విధుల్లోకి ఓపీఓలుగా అంగన్ వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులను తీసుకుంటూ ఆదేశాలు జారీ చేశారు. ఐతే వీరెవ్వరికీ పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసే ఫాం 12లను జారీ చేయలేదు. అధికారుల నిర్లక్ష్యం, ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యవహారంతో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించునే అవకాశం వీరంతా కోల్పోయినట్టు స్పష్టమవుతోంది. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఉద్యోగికీ పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదేనని ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.
అంగన్వాడీ, కాంట్రాక్టు ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఇచ్చేలా ఈసీ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు వీలుగా గడువు పొడిగించాలని కోరారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగంపై ఎన్నికల అధికారుల నిర్ణయాలు గందరగోళంగా ఉన్నాయని ఏపీటీఎఫ్ నేత హృదయరాజు ఆరోపించారు.
టెక్కలి :శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో పోస్టల్ బ్యాలెట్‌పోలింగ్ కేంద్రంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద విధి నిర్వహణలో ఉన్న న్యూస్‌టుడే కంట్రిబ్యూటర్ వట్టికూళ్ల కీర్తి కుమార్ పై టెక్కలి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ గోపాలం దాడికి పాల్పడ్డాడు. దాడి సమయంలో అక్కడే ఉన్న టెక్కలి ఎస్సై లక్ష్మితో పాటు ఇతర పోలీస్ సిబ్బంది ప్రేక్షక పాత్ర వహించారు. అధికార పార్టీ నేతల ప్రోద్బలంతోనే కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.