Employees Confusion Over Postal Ballot Voting in AP : పోస్టల్ బ్యాలెట్ కేంద్రాల వద్ద ఉద్యోగులు బారులు తీరారు. ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొన్ని ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలుచోట్ల కేంద్రాల వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అధికారుల తీరుపై ఓటు వేయటానికి వచ్చిన ఉద్యోగులు అసహనం వ్యక్తంచేశారు.
పోస్టల్ బ్యాలెట్ పోలింగ్‌లో ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం- ఆగ్రహం వ్యక్తం చేసిన ఉద్యోగులు
ఓటు వేయడానికి ఎక్కడికి వెళ్లాలో తెలియక తీవ్ర గందరగోళం : విజయవాడలో పోస్టల్ బ్యాలెట్‌లో తీవ్ర గందరగోళం నెలకొంది. అధికారులు జాగ్రత్తలు తీసుకున్నామని చెబుతున్నప్పటికీ ఉద్యోగులందరికీ ఓటు హక్కు కల్పించడంలో విఫలమయ్యారు. పనిచేసే చోటే ఓటు హక్కు ఉంటుందని సోమవారం వరకు చెప్పిన అధికారులు మంగళవారం మాత్రం నివాసముండే చోట ఓటెయ్యాలని చెప్పారు. ఎక్కడికి వెళ్లాలో తెలియక ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అత్యవసర సర్వీసు ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ అస్తవ్యస్తంగా కొనసాగింది. సమాచార లోపం, అధికారుల సమన్వయ లోపంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఉద్యోగులు మండిపడ్డారు.
టీడీపీ, వైఎస్సార్సీపీ నేతల మధ్య వాగ్వాదం :శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది కూటమి అభ్యర్థి సవిత పోలింగ్ కేంద్రం వద్దకు రాగానే వైఎస్సార్సీపీ అభ్యర్థి ఉషశ్రీచరణ్ పది మంది కార్యకర్తలతో లోనికి వెళ్లారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదంతో స్వల్ప ఉద్రిక్తత తలెత్తింది. లాఠీఛార్జి చేసిన పోలీసులు ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించేశారు. శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో పోలింగ్ కేంద్రం వద్ద డబ్బులు పంచుతూ వైఎస్సార్సీపీ నేతలు హల్‌చల్ చేశారు. ఓటర్ల జాబితా పట్టుకుని.. పోలింగ్ కేంద్రంలో తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. వైకాపా నాయకుల వ్యవహారాన్ని తెలుగుదేశం నేతలు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వైఎస్సార్సీపీ నాయకుల్ని వదిలేసిన పోలీసులు తెదేపా శ్రేణులనే బయటకు వెళ్లాలని సూచించారు. దీంతో వైఎస్సార్సీపీ వారిని పంపితేనే తామూ వెళ్తామని తెదేపా నాయకులు పట్టుపట్టడంతో చేసేది లేక పోలీసులు వైఎస్సార్సీపీ వాళ్లని కూడా బయటకు పంపించారు. పుట్టపర్తి పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలో ఓటేయడానికి వచ్చిన ఉద్యోగులు సరైన సౌకర్యాలు లేక అవస్థలు పడ్డారు.
వైఎస్సార్సీపీ నాయకుల ప్రలోభాలు ఆగటం లేదు :అనంతపురంలో పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ నాయకుల ప్రలోభాలు ఆగటం లేదు. పోలింగ్ కేంద్రం వద్ద వైకాపా నాయకులు ఓటర్లకు డబ్బు ఆశ చూపిస్తున్నారు. వైకాపా నాయకులు డబ్బు పంపిణీ చేస్తున్నారని పోలీసులకు తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. ప్రలోభాలకు గురిచేస్తున్న వైఎస్సార్సీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కడప ఆర్డీవో కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ వద్ద డబ్బు పంచుతున్నారన్న సమాచారంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. వైఎస్సార్సీపీ, టీడీపీ నేతలను బయటకు పంపించేసి పటిష్ఠ బందోబస్తు మధ్య ఓటింగ్ కొనసాగించారు.