ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలుగు ప్రజల్లో పౌరుషాగ్ని రగిల్చి - ప్రజా ఉద్యమానికి అగ్ని బావుటా అయ్యింది "ఈనాడు" - Eenadu Golden Jubilee Celebrations - EENADU GOLDEN JUBILEE CELEBRATIONS

Eenadu Golden Jubilee Celebrations : తెలుగుజాతి గుండెల్లో ఎదిగి, తెలుగు ప్రజల ఒడిలో ఒదిగి, పాఠకుల మదిలో నిత్యం మెదిలే పత్రిక ఈనాడు! 50 ఏళ్లుగా ఆదరాభిమానాలు కురిపిస్తున్న తెలుగువారి ప్రయోజనాల కోసం, అవిశ్రాంతంగా పోరాడింది ఈనాడు! తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని తట్టిలేపింది. తరచూ ముఖ్యమంత్రుల్ని మార్చే దిల్లీ పెద్దల దుస్సంప్రదాయాన్ని ఈనాడు దునుమాడింది! నాటి ముఖ్యమంత్రులకు జరిగిన అవమానాలపై, తెలుగు జాతిలో పౌరుషాగ్ని రగిలించింది. రాజ్యాంగ విరుద్ధంగా ఎన్టీఆర్​ను పదవీచ్యుతుడిని చేస్తే ప్రజాస్వామ్య పునరుద్ధరణోద్యమం నడిపించింది. అందుకే ఈనాడు పత్రిక తెలుగు జాతి ఆత్మగౌరవ పతాక!

Eenadu Golden Jubilee Celebration
Eenadu Golden Jubilee Celebration (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 8, 2024, 6:05 AM IST

Eenadu 50 Years Celebrations : పౌరులు తమ సమస్యల్ని ఎప్పటికప్పుడు విలేకరుల దృష్టికి తెస్తూ, ప్రజల చేతి ఎత్తుబిడ్డగా ఈనాడును పోషించండి! ఇదీ మొదటి సంపాదకీయంలో తెలుగు ప్రజలకు ఈనాడు వ్యవస్థాపకులు రామోజీరావు ఇచ్చిన పిలుపు! ఆయన కోరినట్లే ఈనాడును తెలుగు ప్రజలు, తమ మానసపుత్రికగా స్వీకరించారు. తెలుగునాట అగ్రగామిగా నిలిపారు. అలాంటి తెలుగు ప్రజల ఆత్మగౌరవ పరిరక్షణలోనూ, ఈనాడు ఎప్పుడూ ముందుంటుంది. ఎక్కడో దిల్లీలో కూర్చుని ఇక్కడి తెలుగు నేతల తలరాతల్ని మార్చడాన్ని ఈనాడు సహించలేకపోయింది. తెలుగువారి ఆత్మగౌరవంపై దిల్లీ పెద్దల పెత్తందారీతనానికి వ్యతిరేకంగా ఈనాడు ఎదురు నిలిచి పోరాడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1978-83 మధ్య నలుగురు సీఎంల్ని మార్చారు నాటి దిల్లీ పెద్దలు! కారణం ఏపీ కాంగ్రెస్‌ నేతలంటే పార్టీ పెద్దలకు చులకన భావం.

1982 ఫిబ్రవరి 3న అప్పటి ముఖ్యమంత్రి అంజయ్యను, ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు రాజీవ్‌ గాంధీ అవమానించడం ఈనాడు కెమెరా కంటపడింది. హైదరాబాద్‌ విమానాశ్రయంలో స్వాగత ఏర్పాట్లపై రాజీవ్‌ చిర్రుబుర్రులాడడం, అంజయ్య ఆయన్ను బతిమాలుకోవడం, సీఎంను స్పెషల్‌ ఫ్లైట్‌లో ఎక్కించుకోకుండా రాజీవ్‌ వెళ్లిపోవడం, అవమాన భారంతో అంజయ్య కంట తడిపెట్టడం! ఇదీ ఆనాటి పరాభవం. ఇది ముఖ్యమంత్రికే కాదు, ఆంధ్రులకు జరిగిన అవమానమని ఈనాడు కలం ఝుళిపించింది. రానే వచ్చెను రాజీవ్‌గాంధీ, పోనేపోయెను అంజయ్య పరువు అంటూ 8ఫోటోలతో అసలేం జరిగిందో పాఠకుల కళ్లకు కట్టింది! రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల బానిస మనస్తత్వంపైనా బెత్తం ఎత్తింది.

ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం పెరగడానికి బీజం వేసింది ఈనాడు :ప్రజాస్వామ్యంలో రాజకీయ శూన్యత భర్తీ కోసమూ ఈనాడు అక్షర యాగం చేసింది. కాంగ్రెస్‌ కబంధ హస్తాల నుంచి విముక్తి కల్పించి, తెలుగునాట కొత్త రాజకీయం పొద్దుపొడిచేలా తనవంతు పాత్ర పోషించింది! ఆనాడు అధికార కాంగ్రెస్‌కు ఈనాడే ప్రతిపక్షం అన్నట్టు రాజకీయ పరిస్థితులుండేవి. ఆ తరుణంలో ఓ రాజకీయ పార్టీ స్థాపించాలని రామోజీరావుపై అనేకమంది ఒత్తిడి చేశారు! ప్రత్యామ్నాయ రాజకీయం రాష్ట్రానికి అందించాలని ఒప్పించే ప్రయత్నం చేశారు! ప్రజాహితం తప్ప రాజకీయ ఆకాంక్ష, పదవీకాంక్ష లేని రామోజీరావు, తనపై వచ్చిన ఒత్తిళ్లను సున్నితంగా తిరస్కరించారు. అదే సమయంలో తెలుగుజాతి ఆత్మగౌరవ నినాదాన్ని ఎత్తుకున్నారు నందమూరి తారక రామారావు!

అప్పుడే పుట్టిన తెలుగుదేశాన్ని కొందరు ఎగతాళి చేస్తుంటే ఈనాడు ఒక్కటే మద్దతుగా నిలబడింది. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం లేనప్పుడు ప్రాంతీయ పార్టీలు ఉద్భవించడం చారిత్రక పరిణామమని ప్రజలకు వినమ్రంగా వివరించింది. అలా ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా తెలుగుదేశం ఆవిర్భావాన్ని ప్రజలు స్వాగతించారు. నూతన రాజకీయ సంస్కృతి రావాలని, అధికారం ఏకస్వామ్యం కాకూడదని కారాదనే భావనతో, ప్రజాభీష్టానికి ఈనాడు కూడా పెద్దపీట వేసింది. ఆనాడు ఈనాడు పోషించిన పాత్రే దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం పెరగడానికి బీజం వేసింది. కొత్త ఫ్రంట్‌లు ఏర్పడి, కాంగ్రెస్‌ను మట్టికరిపించడానికి మార్గదర్శనమైంది.

Eenadu@50 : ప్రజాస్వామిక హక్కుల కోసం - 50 ఏళ్లుగా ఈనాడుది అక్షరాలా ప్రజాపక్షమే - EENADU 50 YEARS

తెలుగుదేశం ఆవిర్భావంతో కొత్తతరం నేతలెందరో రాజకీయ యవనికపైకి వచ్చారు. అలాంటి వారిని సమాజానికి అందించడంలో ఈనాడు ప్రధాన పాత్ర పోషించింది. డాక్టర్లు, లాయర్లు, వివిధ వృత్తులతో ప్రజలకు దగ్గరైన నవయువకులను చట్టసభకు పంపడంలో దోహదపడింది. ఎన్టీఆర్​ స్థాపించిన తెలుగుదేశం 9 నెలల్లోనే అధికారంలోకి రావడానికి ఈనాడు అక్షరాలు సోపానాలయ్యాయి! రాష్ట్ర రాజకీయాన్ని ఆవహించిన నియంతృత్వాన్ని ప్రతిఘటించడమే ఆనాడు ఈనాడు కర్తవ్యం! తెలుగుదేశం ప్రభుత్వం మంచి చేస్తే ఈనాడు అభినందిస్తుందని, తప్పులు జరిగితే హెచ్చరిస్తుందని 1983 అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మరుసటి రోజే సంపాదకీయం రాశారు! దానికి తగ్గట్లే ఎన్టీఆర్‌ హయాంలో జరిగిన తప్పిదాలను నిర్మొహమాటంగా నిలదీసింది!

ఉద్యమానికి అగ్ని బావుటా : తెలుగుజాతి ఆత్మగౌరవానికి భంగం వాటిల్లినప్పుడల్లా ఈనాడు అక్షరాలు అగ్ని బాణాలై దూసుకుపోయాయి. దానికి నిదర్శనమే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినప్పుడు సాగించిన ప్రజాస్వామ్య పునరుద్ధరణోధ్యమం! పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారం చేపట్టిన ఎన్టీఆర్‌, ఆనాటి ప్రధాని ఇందిరకు కొరకరాని కొయ్యలా కనిపించారు. ఎన్టీఆర్​పై రగిలిపోతున్న ఇందిర, తెలుగుదేశం అసంతృప్త నేత నాదెండ్ల భాస్కరరావును ఓ పావులా ప్రయోగించారు! ఆనాటి గవర్నర్‌ రామ్‌లాల్‌ను కీలుబొమ్మగాచేసుకున్నారు. 1984లో చికిత్స కోసం ఎన్టీఆర్​ అమెరికా వెళ్లగానే ఆయన ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేశారు. ఆ వెంటనే నాదెండ్ల భాస్కరరావుతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ ప్రజాస్వామ్య హత్యతో తెలుగు జాతి రగిలింది. ఆ సమయంలో ప్రతి అక్షరంలో ధర్మాగ్రహాన్ని పలికించింది ఈనాడు. తెలుగు ప్రజల్లో పౌరుషాగ్ని రగిల్చి ప్రజా ఉద్యమానికి అగ్ని బావుటా అయ్యింది. కేంద్రం తీరును ఎండగడుతూ దాదాపు 15 రోజులపాటు పదునైన సంపాదకీయాలు సంధించారు రామోజీరావు. రామ్‌లాల్‌ను రావణలాల్‌గా సంబోధిస్తూ, గో బ్యాక్‌ అని గర్జించారు. ఇందిర ఓ నియంతంటూ నిప్పులు కురిపించారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమాన్ని, అక్షర అక్షౌహిణులతో నడిపించారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది రాజ్యాంగంపై అత్యాచారమని కడిగిపారేశారు. గవర్నర్‌ వ్యవస్థ దుర్వినియోగాన్ని యావద్దేశం కళ్లకు కట్టారు.

నిన్నన్నది చరిత్ర - రేపన్నది భవిష్యత్‌ - నేడు అన్నదే నిజం.! అదే ఈనాడు గమనం, గమ్యం.! - EENADU 50 YEARS

దేశవ్యాప్తంగా ఓ గొప్ప రాజకీయ చైతన్యాన్ని రగిలించారు. ఈనాడు అక్షర అస్త్రాలతో రాష్టంలో ప్రజాగ్రహం లావాలా పెల్లుబికింది. నాటి దిల్లీ పెద్దలు సీఆర్​పీఎఫ్​ను దించారు. మనుషులు కనిపిస్తే లాఠీలతో కొట్టించారు. కాల్పులుకూ తెగబడి కొందరిని బలిగొన్నారు. కొన్నాళ్లపాటు తెలుగునేలపై అన‌ధికారిక క‌ర్ఫ్యూ రాజ్యమేలింది. ఎక్కడ చూసినా రోడ్డుకి అడ్డంగా కాల్చిన టైర్లు, రాళ్లు! అంతటి సంక్షోభంలోనూ ఈనాడు పేప‌ర్ పంపిణీ ఆగలేదు! ప్రేరణ ఆపలేదు! ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన తీరుపై జనాల్ని కర్తవ్యోన్ముఖులను చేసింది. ఊరూవాడా ఏకం చేసింది! ఆ మహోజ్వల పోరాటంతో ఇందిర ప్రభుత్వం దిగొచ్చింది.

నవ్యాంధ్ర నూతన రాజధానికి నామకరణం చేసింది రామోజీరావునే : 1984 ఆగస్టు 25న గవర్నర్‌ రామ్‌లాల్‌తో రాజీనామా చేయించింది. శంకర్‌దయాళ్‌ శర్మను కొత్త గవర్నర్‌గా పంపింది. 1984 సెప్టెంబర్‌ 16న ఎన్టీఆర్​ను ముఖ్యమంత్రిగా మళ్లీ ప్రమాణస్వీకారం చేయించారు. తారకరాముడికి తిరిగి పట్టాభిషేకం జరిగే వరకూ 31రోజులపాటు సంచలన సంపాదకీయాలు, ఇందిరాగాంధీ కుట్రల్ని చీల్చిచెండాడే కార్టూన్లతో ఈనాడు జరిపిన ప్రజాస్వామ్య పునరుద్ధరణపోరాటానికి సమకాలీన పత్రికా ప్రపంచం నివ్వెరపోయింది. తెలుగుజాతి పౌరుషాన్ని తట్టిలేపడమేకాదు జాతికి నష్టం జరుగుతుందని అనుకున్నప్పుడు సంయమనాన్నీ బోధించింది ఈనాడు.

1988 డిసెంబర్ 26న వంగవీటి రంగా హత్యతో కోస్తా అట్టుడికింది. ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. కులాల పేరిట జరిగే రాజకీయ కుమ్ములాటల్లో భాగస్వాములై తెలుగుజాతికి తలవంపులు తేవొద్దని ఈనాడు తన సంపాదకీయం ద్వారా ప్రజల్ని కోరింది. శాంతిస్థాపనలో తన వంతుపాత్ర పోషించింది. 1990లో హైదరాబాద్‌లో మత కలహాలు రేగినప్పుడు మతాలు వేరైనా మానవులంతా ఒక్కటే అనే మహాధర్మాన్ని బోధించి, భాగ్యనగరంలో ప్రశాంతతకు పాటుపడింది. తెలుగువారి జీవనగమనంలో మమేకమైన ఈనాడు. ప్రతీ చారిత్రక సందర్భంలో పథనిర్దేశం చేస్తుంది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర నూతన రాజధానికి నామకరణం చేసింది. విభజిత ఆంధ్రప్రదేశ్‌ చారిత్రక వైభవాన్ని విశ్లేషించిన ఈనాడు అధినేత రామోజీరావు. రాజధానికి అమరావతి పేరును సూచించారు! ప్రభుత్వం కూడా దాన్ని అంగీకరించింది.

Eenadu@50 : నలుచెరుగులా ఈనాడు జైత్రయాత్ర – ఇది తెలుగు ప్రజల గుండెచప్పుడు - EENADU GOLDEN JUBILEE

Eenadu@50 : నిత్యం ఉషోదయాన సత్యం నినదిస్తున్న సమాచార విప్లవ శంఖారావం 'ఈనాడు' - Eenadu Golden Jubilee

ABOUT THE AUTHOR

...view details