ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పురందేశ్వరి ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం - Purandeshwari Complaint

EC Responds To Purandeshwari Complaint: సీఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డి, విజిలెన్స్‌ విభాగాధిపతి రఘురామ్‌రెడ్డి పాటు పలువురు అధికారులు, వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఆమె ఫిర్యాదులో పేర్కొన్న అంశాలన్నింటిపై తక్షణమే నివేదిక పంపించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనాను ఆదేశించింది.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 10, 2024, 9:17 AM IST

పురందేశ్వరి ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం

EC Responds To Purandeshwari Complaint: కేంద్ర ఎన్నికల సంఘానికి పురందేశ్వరి ఈ నెల 1న, సీఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డి, విజిలెన్స్‌ విభాగాధిపతి రఘురామ్‌రెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డితో పాటు, పలు జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులపై అధికార పార్టీకి అండ కాస్తున్నారని ఫిర్యాదు చేశారు. 4వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం అండర్‌ సెక్రటరీ సంజయ్‌కుమార్‌ నుంచి మీనాకు ఉత్తర్వులు అందాయి. పురందేశ్వరి తన లేఖలో నిఘా విభాగాధిపతి పీఎస్సార్‌ ఆంజనేయులు, ఏపీ బెవరేజస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డిపైనా ఫిర్యాదు చేశారు. వారందరినీ అవినీతిపరులైన అధికారులుగా పేర్కొన్నారు.

అధికార పార్టీకి సహకరిస్తున్నారు: రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు ఎన్నికలు సక్రమంగా జరుగుతాయన్న నమ్మకాన్ని కలిగించడం లేదని పురందేశ్వరి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసుల అనవసర జోక్యం బాగా పెరిగిందని, అధికార పార్టీకి అడ్డగోలుగా సహకరిస్తూ, ప్రతిపక్షాలను తీవ్రంగా వేధిస్తున్న ఘటనలు భారీగా జరుగుతున్నాయన్నారు. అధికారుల తీరు పౌరుల ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగించడంతో పాటు, ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతను దెబ్బతీసేదిగా ఉందని తెలిపారు. ఆ సంఘటనలేవీ అనుకోకుండా జరిగినవి కాదని, ఎన్నికల ఫలితాల్ని ప్రభావితం చేసేందుకు పోలీసులు ఉద్దేశపూర్వకంగా పాల్పడిన చర్యలేనని పురందేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, సక్రమంగా, పారదర్శకంగా జరగాలంటే ఈ అధికారులందరిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు.

సీనియర్​ అధికారులను పక్కనపెట్టి: ప్రస్తుత డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిని వైసీపీ ప్రభుత్వమే నియమించిందని, ఆయనదీ ముఖ్యమంత్రి జగన్‌ సామాజికవర్గమే కాకుండా ఇద్దరిదీ ఒకే జిల్లా అని పురందేశ్వరి ఫిర్యాదు చేశారు. డీజీపీగా ఆయన నియామకంపై అప్పట్లో చాలా విమర్శలు వచ్చినా, డీజీపీ పోస్టుకు అర్హులైన ఆరేడుగురు సీనియర్‌ అధికారుల్ని పక్కనపెట్టి సర్వీసులో వారికంటే జూనియర్‌ అయిన రాజేంద్రనాథరెడ్డిని డీజీపీగా నియమించారని వివరించారు. అందుకాయన కృతజ్ఞత తీర్చుకుంటున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారని లేఖలో ఆరోపించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరిగిన దొంగ ఓటర్ల నమోదుపై గానీ, దానికి కారకులైన వైసీపీ నాయకులపైగానీ డీజీపీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని వివరించారు. దొంగ ఓటర్లపై పత్రికలు, టీవీ ఛానళ్లలో అనేక వార్తలొచ్చినా.. ఆయన స్పందించలేదన్నారు. ఆ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకునే వరకు ఆయన మౌన ప్రేక్షకుడిలానే వ్యవహరించారని పేర్కొన్నారు.

వైసీపీ ది రాక్షస పాలన- ప్రతి ఒక్కరి మీద రెండు లక్షల అప్పుల భారం మోపారు: పురందేశ్వరి - Purandeswari Fires On CM Jagan

ఫోన్​ ట్యాపింగ్​.. వాలంటీర్ల నుంచి సమాచారం సేకరణ: విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాధిపతి కొల్లి రఘురామ్‌రెడ్డి, నిఘా విభాగాధిపతి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, ఫోన్లు ట్యాపింగ్‌ చేస్తున్నారని పురందేశ్వరి ఫిర్యాదు చేశారు. వాలంటీర్ల నుంచి డేటా, సమాచారం సేకరిస్తున్నారని, ఇంటలిజెన్స్‌ బ్యూరో ఇచ్చిన సమాచారాన్ని అధికార పార్టీ నాయకులకు చేరవేస్తూ, వారికి అన్ని విధాలా సహకరిస్తున్నారన్నారు. స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలకు విఘాతం కలిగిస్తున్నారని వాళ్లద్దిర్నీ వెంటనే ఆయా స్థానాల నుంచి బదిలీ చేయాలని పురందేశ్వరి డిమాండ్‌ చేశారు.

తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి ధర్మారెడ్డి అధికార వైసీపీకి బహిరంగ మద్దతుదారుగా వ్యహరిస్తున్నారని పురందేశ్వరి చెప్పారు. బడా పారిశ్రామికవేత్తలు, దాతల నుంచి వైసీపీకి ఆర్థికంగా మద్దతు లభించేలా చేయటమే ప్రధాన లక్ష్యంగా ఆయన్ను ఆ స్థానంలో నియమించారని వివరించారు. 2006లోనే ధర్మారెడ్డి లక్షకు పైగా ఆర్జిత సేవా టికెట్లు విక్రయించి అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలున్నాయని పురందేశ్వరి తెలిపారు. ధర్మారెడ్డిని వెంటనే అక్కణ్నుంచి బదిలీ చేసి, తటస్థంగా ఉండే అధికారిని నియమించాలని కోరారు.

సిద్ధం సభలో పురందేశ్వరిపై సీఎం జగన్​ వ్యాఖ్యలు - ఈసీకి బీజేపీ ఫిర్యాదు - BJP Complained to EC Against Jagan

మద్యం విక్రయాలకు ప్రధాన బాధ్యుడు ఆయనే: ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బెవరేజస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డి వైసీపీ మద్దతుదారు మాత్రమే కాదని, రాష్ట్రంలో జరుగుతున్న చీప్‌ లిక్కర్‌ క్రయవిక్రయాలకు ఆయనే ప్రధాన బాధ్యుడని ఆరోపించారు. రాష్ట్రంలో నగదు రూపంలో మద్యం విక్రయాలు జరపటంలో వేల కోట్ల రూపాయల అవినీతి ఉందని చెప్పారు. దానిపై సీబీఐ విచారణకు భాజపా ఇప్పటికే డిమాండు చేసిందని తెలిపారు. అధికార వైసీపీ నాయకులతో ఉన్న సంబంధాల రీత్యా, ఎన్నికల వేళ వాసుదేవరెడ్డి వారికి భారీ ఎత్తున మద్యం సరఫరా చేస్తున్నారని పురందేశ్వరి వివరించారు. ఆయన్ను వెంటనే ఆ బాధ్యతల నుంచి తప్పించి, విచారించాలని డిమాండ్‌ చేశారు.

సమర్థులైన పలువురు సీనియర్‌ అధికారుల్ని పక్కనబెట్టి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కేఎస్‌ జవహర్‌రెడ్డిని నియమించారని, పురందేశ్వరి ఫిర్యాదు చేశారు. అనుచిత ప్రయోజనాల కోసమే ఆయన్ను ఆ స్థానంలో కూర్చోబెట్టారని, తనకు కీలకమైన పోస్ట్‌ కట్టబెట్టినందుకు ప్రత్యుపకారంగా జవహర్‌రెడ్డి బహిరంగంగా వైసీపీ ప్రభుత్వానికి సహాయపడుతున్నారని తెలిపారు. మెరిట్‌, సీనియారిటీ ప్రాతిపదికన కాకుండా, ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన కొందరికి ముందుగా బిల్లులు చెల్లించేలా చూడటంలో సీఎస్‌ కీలక భూమిక నిర్వహించారని ఫిర్యాదులో పురందేశ్వరి తెలిపారు.

పింఛన్​ పంపిణీ అంశాన్ని వైసీపీ రాజకీయం చేస్తుంది: పురందేశ్వరి - PURANDESWARI ON PENSIONS

ABOUT THE AUTHOR

...view details