ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గంజాయి కేసుల్లో 20 ఏళ్లు జైలు - మళ్లీ నేరం చేస్తే మరణశిక్ష!: ఈగల్ విభాగాధిపతి రవికృష్ణ - EAGLE IG RK RAVIKRISHNA ON DRUGS

గంజాయి సేవించినా, విక్రయించినా, రవాణా చేసినా నేరమేనన్న ఈగల్ విభాగాధిపతి ఆకె రవికృష్ణ - 'సే నో టూ డ్రగ్స్' పేరుతో విజయవాడ పీబీ సిద్ధార్ధ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

Say No to Drugs Programme at Siddhartha College in Vijayawada
గంజాయి కేసుల్లో 20 ఏళ్లు జైలు - రెండు కేసుల్లో దోషిగా తేలితే మరణశిక్ష! (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 3, 2025, 10:27 PM IST

Updated : Feb 3, 2025, 11:01 PM IST

Say No to Drugs Programme at Siddhartha College in Vijayawada : రెండు ఎన్‌డీపీఎస్‌ (NDPS Act ) కేసుల్లో జైలు శిక్షపడి, మళ్లీ నేరం చేసిన నిందితులకు మరణశిక్ష పడే అవకాశం ఉందని ఈగల్ విభాగం ఐజీ ఆకె రవికృష్ణ అన్నారు. గంజాయి సేవించినా, విక్రయించినా ఏడాది నుంచి 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుందన్నారు.
విద్యార్ధులు గంజాయికి బానిసలై విలువైన భవిష్యత్ ను కోల్పోవద్దని హితవు పలికారు.

మత్తు పదార్ధాల వినియోగాన్ని నియంత్రించేందుకు ప్రతీ కళాశాలలో ఈగల్ బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. గంజాయి సేవించినా, విక్రయించినా, రవాణా చేసినా నేరమేనని తెలిపారు. 'సే నో టూ డ్రగ్స్' పేరుతో విజయవాడ పీబీ సిద్ధార్ధ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈగల్ ఐజీ, ఎన్టీఆర్ జిల్లా సీపీ పాల్గొని విద్యార్ధులకు గంజాయి వల్ల వచ్చే నష్టాలను వివరించారు.

ప్రతీ కళాశాలలో ఈగల్ బృందాలు : ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం రెండు కేసుల్లో కన్విక్షన్ పొందిన నేరస్తులకు కేసు తీవ్రత ఆధారంగా మరణశిక్ష సైతం పడే అవకాశం ఉందని ఈగల్ విభాగాధిపతి ఐజీ ఆకె రవికృష్ణ అన్నారు. యువత మత్తు పదార్ధాలకు బానిస కాకుండా ఉండేందుకు ఈగల్ విభాగం కఠిన చర్యలు చేపడుతుందన్నారు. ప్రతీ కళాశాలలో ఈగల్ బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ బృందంలో ఉపాధ్యాయులు, విద్యార్ధులు ఉంటారని తెలిపారు. మత్తు పదార్ధాల విక్రయాలు, వినియోగం గురించి సమాచారం తెలిస్తే 1972 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఐజీ కోరారు. విద్యార్ధులే ఈగల్ అంబాసిడర్లుగా ఉండాలన్నారు. సే నో టూ డ్రగ్స్ పేరుతో విజయవాడ పీబీ సిద్ధార్ధ కళాశాలలో గంజాయి వల్ల కలిగే నష్టాలను విద్యార్ధులకు అవగాహన కల్పించారు.

'మత్తు వీడు బ్రో' - డ్రగ్స్‌ నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు

ఎన్డీపీఎస్ కేసుల్లో ఇరుక్కుంటే అంతే : కొందరు విద్యార్ధులు కిక్కు కోసం గంజాయిని సేవించి చివరకు మత్తుకు బానిసలుగా మారుతున్నారు. దీంతో ఆ విద్యార్ధి కుటుంబం చిన్నాభిన్నమవుతోంది. దళారులు డబ్బు కోసం విద్యార్ధులకు గంజాయి ఎర వేసి నేరగాళ్లుగా మారుస్తున్నారని తెలిపారు. ఒక్కసారి ఎన్డీపీఎస్ యాక్ట్ కేసుల్లో ఇరుక్కుంటే మీ పేరు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిదాన్ పోర్టల్ నమోదవుతుందని ఐజీ ఆకె రవికృష్ణ హెచ్చరించారు. దీంతో పాస్ పోర్ట్ రాదని విలువైన జీవితం అంధకారంలో పడుతుందన్నారు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల ఎకరాల్లో గంజాయి సాగు ఉండేదని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి సాగు విస్తీర్ణం 100 ఎకరాల లోపే ఉందని తెలిపారు. డ్రోన్స్, శాటిలైట్ పరిజ్ఞానం వినియోగించి గంజాయి సాగును గుర్తిస్తున్నట్లు తెలిపారు.

చాక్లెట్ల రూపంలో గంజాయిని సరఫరా : ఉత్తరాంధ్రలో గంజాయి సాగు గతంలో విచ్చలవిడిగా ఉండేదని ఎన్టీఆర్ జిల్లా సీపీ రాజశేఖర బాబు అన్నారు. ప్రపంచానికి గంజాయి ఎగుమతి చేసే స్థాయిలో గంజాయి సాగు జరిగేదన్నారు. మత్తు పదార్ధాల రవాణాను నియంత్రించేందుకు కూటమి ప్రభుత్వం ఈగల్ విభాగాన్ని ఏర్పాటు చేసిందన్నారు. బ్లేడ్ బ్యాచ్ ఆగడాలకు గంజాయి ప్రధాన కారణమన్నారు. డ్రోన్ ద్వారా నిర్మానుష్య ప్రాంతాల్లో గంజాయి సేవిస్తున్న వారిపై నిఘా పెట్టి గుర్తిస్తున్నామని సీపీ తెలిపారు. విద్యార్ధులకు చాక్లెట్ల రూపంలో గంజాయిని సరఫరా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. పాఠశాలలు, కళాశాలల వద్ద కొందరు విద్యార్ధులను గుర్తించి మత్తుకు బానిసలను చేస్తున్నారని అన్నారు. స్నేహితులు గంజాయి సేవించాలని ఒత్తిడి చేస్తే నో అని గట్టిగా చెప్పండని సీపీ రాజశేఖర బాబు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇప్పటికే డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపిందన్నారు. మత్తుకు అలవాటైన విద్యార్ధులు దీని నుంచి బయటకు రావటం కష్టంగా మారుతుందని తెలిపారు.

సే నో టూ డ్రగ్స్ : డ్రగ్స్ అరికట్టడంపై పోలీసులు ఏర్పాటు చేసిన అవగాహనా సదస్సు వల్ల చాలా విషయాలు తెలుసుకున్నామని విద్యార్ధులు చెబుతున్నారు. గంజాయి వినియోగం వల్ల కలిగే నష్టాలను అందరికీ వివరిస్తామని విద్యార్ధులు తెలిపారు. గంజాయి విక్రయాలపై సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని విద్యార్ధులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పోలీసులు సూచించారు.

ఏపీలో 'ఈగల్' సైన్యం - వారిపై యుద్ధానికి సిద్ధం

'మన కోసం బతికేవాళ్లు ఉన్నారు - అవి అవసరమా డార్లింగ్స్' - ప్రభాస్ న్యూఇయర్ మేసేజ్

Last Updated : Feb 3, 2025, 11:01 PM IST

ABOUT THE AUTHOR

...view details