Driving License for Deaf People :అందరిలాగే బధిరులకు కూడా రవాణాశాఖ నుంచి డ్రైవింగ్ లైసెన్సులు పొందవచ్చు. వినికిడి యంత్రంతో వినగలిగే సామర్థ్యం, కొన్ని సులువైన నిబంధనలు పాటిస్తానని మాటిస్తే చాలు రవాణాశాఖ లైసెన్స్ మంజూరు చేస్తుంది. బధిరులు కూడా బైక్, కారు నడిపేలా లైసెన్సులు జారీ చేయాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు ఏపీ సర్కార్ ఈ విధానాన్ని అమలు చేస్తోంది.
బధిరులు లైసెన్సు కోసం అర్జీ చేసుకున్న తర్వాత డ్రైవింగ్ పరీక్ష సమయంలో సదరం శిబిరంలో జారీ చేసిన ధ్రువపత్రాన్ని చూపాల్సి ఉంటుంది. రోడ్డుపై దరఖాస్తుదారుతో రవాణా అధికారి కూర్చుని వాహనం నడపమంటారు. వాహనాలు హారన్ మోగిస్తే దానికి స్పందిస్తున్నారా, లేదా అనేది చూస్తారు. అనంతరం లైసెన్స్ ఇవ్వాలా వద్దా అని నిర్ణయం తీసుకుంటారు. తాను నడిపే వాహనం ముందు, వెనుకవైపు ప్రత్యేక స్టిక్కర్ అతికించుకుంటానని, వినికిడి యంత్రం పెట్టుకొనే వాహనం నడుపుతానని రవాణాశాఖ అధికారులకు దరఖాస్తుదారు అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎరుపు రంగు బ్యాక్‌గ్రౌండ్‌పై. తెలుపు రంగులో చెవి గుర్తు, వినిపించదు అనేలా క్రాస్ గుర్తు, పైన డ్రైవర్ ఈజ్ డెఫ్ అని, కింద ప్లీజ్ వాచ్ ఔట్ అని స్టిక్కర్ ఉంటుంది. దీనిని తప్పనిసరిగా వాహనం ముందు, వెనుక అతికించుకోవాలి. రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారులను ఆ స్టిక్కర్ అప్రమత్తం చేస్తుంది.