మిగులు పనులు పట్టించుకోని జగన్ సర్కార్ - నంద్యాల ప్రజలకు నీటి కష్టాలు Drinking Water Problem in Nandyal: పక్కనే కుందూ నది. 30 కిలోమీటర్ల దూరంలో వెలుగోడు జలాశయం. అయినా నంద్యాల పట్టణాన్ని తాగునీటి ఎద్దడి వేధిస్తోంది. వైసీపీ ప్రభుత్వ అసమర్థత కారణంగా పట్టణ ప్రజలు నీళ్ల కోసం తిప్పలు పడాల్సి వస్తోంది. తెలుగుదేశం హయాంలో 70 శాతం పూర్తైన తాగునీటి పథకం పనుల్ని ఈ ఐదేళ్లుగా పట్టించుకోకపోవడంతో ఈ వేసవిలో నీటి కష్టాలు మరింత తీవ్రం కావొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.
జిల్లా కేంద్రమైన నంద్యాల జనాభా 3 లక్షలకు పైమాటే. శరవేగంగా విస్తరిస్తున్న ఈ పట్టణంలో తాగునీటి సమస్య అంతే తీవ్రంగా పెరుగుతోంది. నంద్యాలలో 42 వార్డులు ఉండగా సగానికిపైగా వార్డుల్లో 2 రోజులకు ఒకసారి తాగునీరు సరఫరా చేస్తున్నారు. శివారు కాలనీల్లో మూడు నాలుగు రోజులకు ఒకసారి నీరు వస్తోంది. వేసవి కావడంతో రాబోయే రోజుల్లో తాగునీటి కోసం తిప్పలు తప్పవన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
గుక్కెడు నీటికి అలమటిస్తున్న ఎస్సీ కాలనీలు- పట్టించుకోండి మహాప్రభో!
నంద్యాల తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి 2017లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అమృత్-1 ఫేజ్-2 కింద 138 కోట్ల రూపాయలు కేటాయించింది. టీడీపీ సర్కారు హయాంలోనే పనులు ప్రారంభమై 70 శాతం పూర్తయ్యాయి. 2020 నాటికి పథకం అందుబాటులోకి రావాల్సి ఉంది. వెలుగోడు జలాశయం నుంచి నంద్యాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వరకు 35 కిలోమీటర్ల మేర పైపు లైన్ ద్వారా నీటిని తరలించి పట్టణ ప్రజలకు సరఫరా చేయాల్సి ఉంది.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదేళ్లయినా మిగిలిన 30 శాతం పనులు పూర్తి చేయలేదు. దీనిపై పురపాలక సంఘంలో కౌన్సిలర్లు ఆందోళన వ్యక్తం చేసినా స్పందన లేదు. ఎన్నికల వేళ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గత నెలలో హడావిడి చేశారు. పనులు పూర్తి కాకపోయినా వెలుగోడు జలాశయం నుంచి పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వకపోయినా ఓ తాగునీటి శుద్ధి కేంద్రం ప్రారంభించారు. ఫిల్టర్ బెడ్, హెడ్ వాటర్ ట్యాంక్‌లు సహా మరికొన్ని పైప్ లైన్ పనులు పూర్తి కావాల్సి ఉండటంతో జనానికి నీళ్లు మాత్రం సరఫరా కావడం లేదు.
పనులు ఆలస్యం అవుతుండటంతో నంద్యాల తాగునీటి పథకం అంచనా వ్యయం 158 కోట్ల రూపాయలకు పెరిగింది. ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వం కాలయాపన చేయటం వల్ల పట్టణంలో తాగునీటి ఎద్దడి రోజురోజుకు తీవ్రమవుతోంది. దీనిపై అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
"తాగునీటి సమస్యతో మేము నానావస్థలు పడుతున్నాం. నీళ్లు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. రెండుమూడు రోజులకొకసారి నీళ్లు వచ్చినా చాలా తక్కువసేపు మాత్రమే ఇస్తున్నారు. సరిపడా నీటిసరఫరా చేయకపోవటంతో మేము చాలా అవస్థలు పడుతున్నాం. పరిస్థితి ఇలాగే ఉంటే ఈ వేసవిలో నీటి కష్టాలు మరింత తీవ్రం కావొచ్చు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి సమస్యపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం." - స్థానికులు
నీటి ఎద్దడితో వరి రైతుల అవస్థలు - పట్టించుకోని అధికారులు