MLA PinnelliRamakrishna Reddy Destroying EVM But Not Filing a Case Immediately :ఈనెల 13న మాచర్లలో జరిగిన విధ్వంసంలో సీసీ టీవీ వీడియో బయటకు వచ్చేంత వరకూ నిందితుల జాబితాలో ఎమ్మెల్యే పిన్నెల్లి పేరును చేర్చకపోవడం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే, పోటీలో ఉన్న అభ్యర్థి మధ్యాహ్నం సమయంలో పోలింగ్ సిబ్బందితో సహా అందరూ చూస్తుండగా ఈవీఎంను ఎత్తి నేలపై విసిరికొడితే గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని కేసు పెట్టడాన్నిబట్టే అధికారులు ఎమ్మెల్యేకు ఎంత అనుకూలంగా పనిచేశారో అర్థమవుతోంది.
పోలింగ్ కేంద్రంలో 13న మధ్యాహ్నం రామకృష్ణారెడ్డి ఈవీఎంను, వీవీప్యాట్‌ను ధ్వంసం చేసిన సంఘటనలు సీసీ టీవీలో రికార్డు అవడంతో పాటు అక్కడి పోలింగ్ సిబ్బందీ సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేశారు. కానీ ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం వరకు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయలేదు. ఇలాంటి ఘటన జరిగినప్పుడు అక్కడ పోలింగ్ అధికారి విషయాన్ని తక్షణం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. పోలీసులకు ఫిర్యాదు చేయాలి. కానీ ఎమ్మెల్యేపై భయభక్తులతో ఫిర్యాదు చేసేందుకు పోలింగ్ అధికారి ముందుకు కాలేదు. గుర్తుతెలియని వ్యక్తులు కంట్రోల్ ప్యానల్, వీవీ ప్యాట్ యంత్రాలను ధ్వంసం చేశారని స్థానిక వీఆర్వో ఈనెల 15న ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే సహా ఎవరి పేర్లూ దీనిలో ప్రస్తావించలేదు.