Dissolution of AP Assembly :ఏపీ అసెంబ్లీని రద్దు చేస్తూ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆర్టికల్ 174 ప్రకారం మంత్రివర్గం సిఫార్సు మేరకు ఏపీ 15వ శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు.
ఏపీ అసెంబ్లీ రద్దు చేస్తూ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ (ETV Bharat) Revenue Department Special CS orders: రెవెన్యూ శాఖలో దస్త్రాలను ప్రాసెస్ చేయవద్దని రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమైన దస్త్రాలను ప్రాసెస్ చేయవద్దని స్పెషల్ సీఎస్ పేర్కొన్నారు. గుత్తేదారులకు నిధుల విడుదల, భూ కేటాయింపు దస్త్రాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రి పేషీలోని రికార్డులు, దస్త్రాలను జాగ్రత్తపరచాలని సిబ్బందికి సూచన చేశారు.
Inspections in ministers chambers:ఏపీలో కూటమికి భారీ మెజారిటీ సాధించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం కొత్త ప్రభుత్వం ఏర్పాటు తరువాత మంత్రుల పేషీలు, కార్యాలయాల ఏర్పాట్లకు సంబంధించిన చర్యలకు ఉపక్రమించారు. అందులో భాగంగా సచివాలయంలోని వివిధ కార్యాలయాల వివరాలు సేకరిస్తున్నారు. సచివాలయ సామగ్రి వివరాలు నమోదు చేస్తున్నారు.
రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో సాధారణ పరిపాలన శాఖ (GAD) మంత్రుల పేషీలు, ఛాంబర్లను స్వాధీనం కోసం చర్యలకు ఉపక్రించింది. సచివాలయంలో తమ అనుమతి లేకుండా ఎలాంటి పత్రాలు, వస్తువులు బయటకు తీసుకెళ్లొద్దంటూ జీఏడీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగానే నేడు మంత్రుల కార్యాలయాల స్వాధీన ప్రక్రియను ప్రారంభించింది.
సచివాలయంలోని మంత్రుల ఛాంబర్లను సాధారణ పరిపాలన శాఖ స్వాధీనం చేసుకుంటుంది. మంత్రులు, సలహాదారుల పేషీల నుంచి బోర్డులను సాధారణ పరిపాలన శాఖ సిబ్బంది తీసేశారు. మంత్రుల పేషీల్లోని ఫర్నిచర్, కంప్యూటర్ల వివరాలను నమోదు చేసుకుని జీఏడీ అధికారులు వాటితో సరిపోల్చుకుంటున్నారు. వ్యక్తిగత సామగ్రి సచివాలయం నుంచి బయటకు తీసుకెళ్లేందుకు బిల్లులు చూపించాలని జీఏడీ సిబ్బంది స్పష్టం చేస్తుంది. ప్రత్యేకించి మంత్రుల పేషీలు, ప్రభుత్వ శాఖల్లోని దస్త్రాలు, కాగితాలను స్వాధీనం చేసుకుంది. కార్యాలయం నుంచి బయటికి వెళ్లే వాహనాలను ఎస్పీఎఫ్ సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు.