ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆర్టీసీకి కలసిరాని దసరా పండగ - ఆశించిన స్థాయిలో ఆదరించని ప్రయాణికులు

తలకిందులైన అధికారుల అంచనాలు - ఆర్టీసీ ఆదాయానికి గండి కొట్టిన ప్రైవేటు వాహనదారులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

DISAPPOINTMENT_TO_APSRTC
DISAPPOINTMENT TO APSRTC (ETV Bharat)

DISAPPOINTMENT TO APSRTC: దసరా పండుగ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు (RTC) నిరాశే మిగిల్చింది. ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసినా ఆశించిన స్థాయిలో ప్రయాణికులు ఆదరించలేదు. పండుగ ముందు రోజుల్లో ఆర్టీసీ బస్సెక్కే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రైవేటు వాహనదారులు పోటీ పడి మరీ ఆర్టీసీ ప్రయాణికులను తమ వైపు లాక్కు వెళ్తోన్న కారణంగా సంస్థ రాబడికి గణనీయంగా గండిపడినట్లు తెలుస్తోంది. ట్రావెల్స్​కు అడ్డుకట్ట వేయడం సహా ప్రయాణికులను తిరిగి రప్పించడంపై ఆర్టీసీ అధికారులు దృష్టి పెట్టారు. తిరుగు ప్రయాణంలోనైనా ప్రైవేటు వాహనదారులు, ట్రావెల్స్ అరాచకాలను అడ్టుకట్ట వేసేలా రవాణాశాఖ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అదే సమయంలో ప్రయాణికులంతా ఆర్టీసీ బస్సులను ఆశ్రయించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలని ఆర్టీసీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ నెల 4 నుంచి విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ సెలవులు ప్రకటించింది. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుందని ఊహించిన ఆర్టీసీ అధికారులు ఈ మేరకు గణనీయంగా బస్సులు ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా దసరా సీజన్ మొత్తానికి కలిపి 6100 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ నెల 4వ తేదీ నుంచి 11 వరకు దసరా ముందు రోజుల్లో పలు ప్రాంతాలకు 3040 బస్సులు ఏర్పాటు చేయగా, 12 నుంచి ఈ నెల 20 వరకు తిరుగు ప్రయాణానికి 3060 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. రోజూ నడిచే రెగ్యులర్ సర్వీసులకు అదనంగా ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది.

ప్రయాణికులు లేక రోడ్డెక్కని బస్సులు: అదనపు బస్సుల్లో ప్రత్యేక ఛార్జీ లేకుండా సాధారణ బస్సుల తరహాలో సాధారణ ఛార్జీలనే వసూలు చేయాలని నిర్ణయించి అమలు చేస్తోంది. గతేడాది కంటే ఈసారి అధిక సంఖ్యలో ప్రయాణికులు వస్తారని ఆశించిన అధికారులకు ఈసారి నిరాశే మిగిలింది. పలు రూట్లలో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రయాణికులు తక్కువ సంఖ్యలో బస్టాండ్లకు వచ్చారు. పలు రూట్లలో సాధారణ బస్సులు సైతం నిండలేదు. దీంతో కొన్ని రూట్లలో ప్రత్యేక బస్సులు సిద్ధంగా ఉంచినా ప్రయాణికులు లేక అవి రోడ్డెక్కలేదు. పలు రూట్లతో కొద్దిపాటి ప్రత్యేక బస్సులు మాత్రమే నడపగలిగారు. దసరా ముందు రోజుల్లో హైదరాబాద్ నుంచి 993 బస్సులు, బెంగళూరు నుంచి 275 బస్సులు, చెన్నై నుంచి 65 బస్సులు పలు పట్టణాలకు ఏర్పాటు చేశారు.

తిరుగు ప్రయాణంపైనే ఆశలు:విశాఖపట్నం నుంచి 320, రాజమహేంద్రవరం నుంచి 260, విజయవాడ నుంచి 400 బస్సులు, సహా పలు ప్రాంతాలు, పల్లెలు, నగరాలకు 730 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఆశించిన స్థాయిలో ప్రయాణికులు రాకపోవడంతో గణనీయంగా అదనపు సర్వీసులను రద్దు చేశారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో, ఈ సారి ఆర్టీసీకి దసరా పండుగ ఆదాయం గణనీయంగా తగ్గిందని ఉన్నతాధికారుల పరిశీలనలో తేలింది. తిరుగు ప్రయాణంపైనే కొంత ఆశలు పెట్టుకున్నా, ఎంతవరకు ఆదాయం వస్తుందనేది చెప్పలేమంటున్నారు.

దసరా స్పెషల్​ - ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే - APSRTC DUSSEHRA SPECIAL BUSES

ఈ ఏడాది దసరాకు భారీగా ఏర్పాట్లు: పండుగ వచ్చిందంటే చాలు రాష్ట్రంలో విజయవాడ మీదుగానే అత్యధిక మంది రాకపోకలు సాగిస్తుంటారు. తెలంగాణ రాష్ట్రం సహా హైదరాబాద్​లో స్థిరపడిన ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రకు చెందిన వారు అత్యధికంగా బెజవాడ మీదుగా రాకపోకలు సాగిస్తారు. మామూలు రోజుల్లోనే పండిట్ నెహ్రూ బస్టేషన్ నుంచి రోజూ 3 వేల 400 సర్వీసులు పలు ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటాయి. పండుగల వేళల్లో అధిక మంది బస్టాండ్​కు రావడంతో కిక్కిరిసి పోతుంటుంది. దీంతో సాధారణ బస్సులకు అదనంగా పలు ప్రాంతాలుకు అధికారులు అదనపు బస్సులు నడిపి గమ్యస్థానాలకు చేర్చుతారు. గతేడాది దసరా పండుగకు బెజవాడ బస్టాండ్ కిటకిటలాడింది. ఈ సారి కూడా పరిస్ధితి అలాగే ఉంటుందని ఆశించిన అధికారులు ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేశారు.

రద్దీ గణనీయంగా ఉంటుందని అంచనా వేసుకోగా: విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు ఈ నెల 4 నుంచి 11 వరకు అన్ని ప్రాంతాలకు కలిపి మొత్తం 653 అదనపు బస్సులు ఏర్పాటు చేశారు. ఈసారి అత్యధికంగా విజయవాడ - హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది వస్తారని భావించి ఆ రూట్లో అధిక బస్సులు కేటాయించారు. ప్రత్యేక బస్సులు నడపడం ప్రారంబించిన తొలి రోజు నుంచే రద్దీ గణనీయంగా ఉంటుందని అంచనా వేసుకోగా అంచనాలు తప్పాయి. ఏర్పాటు చేసిన అదనపు బస్సుల్లో సగం బస్సులు కూడా రోడ్డెక్కలేదు. ఈ నెల 9న కనకదుర్గమ్మ జన్మనక్షత్రమైన మూల నక్షత్రం రోజున విజయవాడకు భారీగా భక్తులు, భవానీలు వస్తాయని అంచనా వేసి ఏర్పాట్లు చేశారు. బస్టాండ్​లో భక్తులు పోటెత్తుతారని ఊహించి అధికారులు, సిబ్బంది సైతం 24 గంటల పాటు బస్టాండ్​లో విధులు నిర్వహిస్తూ పర్యవేక్షించారు.

తొలిసారి అధికారుల అంచనాలు తలకిందులు: సమీప జిల్లాల నుంచి బస్సులను, సిబ్బందిని విజయవాడకు తెప్పించుకుని సిద్ధం చేశారు. అప్పటికప్పుడు ఊహించని రీతిలో ప్రయాణికులు వచ్చి బస్టాండ్ పోటెత్తినా అందరికీ బస్సులు ఏర్పాటు చేసేలా అధికారులు సర్వం సిద్ధం చేశారు. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి అధికారుల అంచనాలు తలకిందులయ్యాయి. గతేడాది మూలా నక్షత్రం రోజున బస్టాండ్ కిటకిటలాడగా, పలు ప్రాంతాలకునడిచే రెగ్యులర్ బస్సులకు అదనంగా 119 అదనపు బస్సులు నడిపారు. ఈ సారీ అదే సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేశారు. కానీ ఆ రోజున భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో కేవలం 41 అదనపు బస్సులు మాత్రమే నడిచాయి. ఏర్పాటు చేసిన 653 బస్సుల్లో ఇప్పటి వరకు పలు ప్రాంతాలకు కేవలం 271 బస్సులు మాత్రమే నడిపినట్లు అధికారులు తెలిపారు.

ఆర్టీసీ వర్గాల్లో తీవ్ర నిరాశ: గతేడాది ఇదే రోజుల్లో 562 ప్రత్యేక బస్సులు నడపగా ఆర్టీసీకి కాసుల వర్షం కురిసింది. ఈ సారి అందులో సగం కూడా నడవక పోవడంతో ఆదాయం గణనీయంగా పడిపోయింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పడిపోవడంతో ఆర్టీసీ వర్గాల్లో తీవ్ర నిరాశ, సహా ఆందోళనకు కారణమైంది. ఆశించిన మేరకు ప్రయాణికులు బస్టాండ్లకు ఎందుకు రాలేదనే విషయంపై ఆరా తీస్తున్నారు. పలువురు వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణించడం సహా, ప్రైవేటు కార్లు, ట్రావెల్స్, వాహనదారులు ప్రయాణికులను తమ వైపు లాక్కువెళ్లడం, కొందరు ప్రయాణికులు సైతం వాటిని ఆశ్రయించడం రద్దీ తగ్గేందుకు ప్రధాన కారణంగా ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇటీవల వచ్చిన వరదల ప్రభావమూ విజయవాడలో రద్దీ తగ్గేందుకు కొంత కారణం ఉండొంచ్చని అనుకుంటున్నారు.

పండుగ వేళ ప్రయాణికులకు గుడ్​న్యూస్​- 10 శాతం రాయితీ ఆఫర్​ వీరికి మాత్రమే - Good News for Passengers

ప్రయాణికులకు అధికారుల విజ్ఞప్తి: పండుగ ముందు రోజుల్లో తీవ్ర నిరాశ కలగడంతో ఇక తిరుగు ప్రయాణంపైనే అధికారులు ఆశలు పెట్టుకున్నారు. పలు ప్రాంతాల నుంచి భారీ ఎత్తున బస్సులు ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ప్రైవేటు బాట పట్టకుండా అన్ని స్టాపుల్లో ప్రత్యేక సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు. తద్వారా ప్రయాణికులు ఆర్టీసీకి దూరం కాకుండా తగు చర్యలు తీసుకోనున్నారు. అత్యధిక రద్దీ ఉండే విజయావాడ మార్గంలో ప్రత్యేక దృష్టి పెట్టారు. పండిట్ నెహ్రూ బస్టేషన్ సహా పరిసర ప్రాంతాల్లో ప్రైవేటు ట్రావెల్స్, వాహనాల అక్రమ రవాణా నివారణపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు.

ప్రయాణికులను బస్టాండ్లకు రప్పించడమే కాకుండా వారికి బస్టాండ్లలో ఇబ్బందులు పడకుండా మెరుగైన వసతులు కల్పన చేయాలని ఆదేశించారు. బస్సుల్లోనూ శుభ్రత సహా సదుపాయాలు మెరుగు పరచాలని ఆదేశించారు. తద్వారా ఆదరణ పొందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయాణికులు ఎవరూ ప్రైవేటు వాహనాల వైపు వెళ్లి ప్రాణాలపైకి తెచ్చుకోవద్దని, ఆర్టీసీ బస్సుల్లో తక్కువ ఛార్జీకే ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

కళతప్పిన విజయవాడ రైల్వే స్టేషన్: దసరా పండుగకు ఊరెళ్లేందుకు రైల్వేశాఖ సైతం పలు ప్రాంతాల నుంచి ఏపీ వైపు సరిపడా రైళ్లను ఏర్పాటు చేయలేదు. దీంతో చాలా మంది వెళ్లేందుకు టికెట్లు బుకింగ్ చేసుకున్నా బెర్తులు ఖరారు కాకపోవడంతో రైల్వే స్టేషన్ల వైపు రాలేదు. గతంలో కంటే జనరల్ బోగీల సంఖ్యను గణనీయంగా తగ్గించడంతో వాటిలో ప్రయాణించలేని పరిస్ధితుల్లో చాలామంది ప్రయాణానికి దూరమయ్యారు. గతంలో దసరా, దీపావళి పండుగకు అన్ని జనరల్ బోగీలతో నడిచే జన్ సాధారణ్ రైళ్లు నడుపగా, ఈ సారి రైల్వేశాఖ ఆ రైళ్లను పక్కనపెట్టింది. ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లూ ఏ పాటికీ సరిపోవడం లేదు. ప్రయాణికులు వ్యక్తిగత, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి గమ్యస్థానాలకు వెళ్తున్నారు. రైళ్లు లేకపోవడంతో శుక్రవారం సైతం విజయవాడ రైల్వే స్టేషన్ కళతప్పింది. తిరుగు ప్రయాణంలోనైనా జనరల్ బోగీలతో నడిచేలా సరిపడా రైళ్లు నడపాలని ప్రయాణికులు రైల్వే అధికారులను కోరుతున్నారు.

ఏపీఎస్ఆర్టీసీ మరో ప్రతిష్టాత్మక ఘనత - నగదు రహిత లావాదేవీల్లో జాతీయస్థాయి అవార్డు - APSRTC Got National Level Award

ABOUT THE AUTHOR

...view details