Digital Content Study Material for 10th Class Students : గత విద్యాసంవత్సరం పదో తరగతి విద్యార్ధులకు మహబూబ్‌నగర్ శాసనసభ్యుడు యెన్నం శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేసిన డిజిటల్ కంటెంట్ స్డడీ మెటిరియల్ ఎంతగానో ఉపయోగపడింది. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలోని మహబూబ్ నగర్ అర్బన్, మహబూబ్ నగర్ రూరల్, హన్వాడ మండలాల్లోని సుమారు 100కుపైగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో డిజిటల్ కంటెంట్ స్టడీ మెటిరీయల్ అందించారు. 2022-23 విద్యాసంవత్సరంలో నియోజక వర్గంలో పదో తరగతి ఉత్తీర్ణత శాతం 66.29 శాతంగా ఉంది. ఈ స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన తర్వాత 2023-24 విద్యాసంవత్సరంలో 89.51 శాతంగా నమోదైంది.
గణితం, భౌతికశాస్త్రం, జీవశాస్త్రం, సాంఘికశాస్త్రం సబ్జెక్టుకు సంబంధించిన డిజిటల్ కంటెంట్‌ను విద్యార్థులకు ఈ పుస్తకంలో అందించారు. పుస్తకంలోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే డిజటల్ పాఠాలు చరవాణీ, ల్యాప్‌టాప్‌లలో తెరచుకుంటాయి. కదిలే బొమ్మలతో, త్రీడీ, యానిమేషన్ రూపంలో పాఠాల్ని పిల్లలకు సులువుగా అర్థమయ్యేలా రూపొందించారు. కేవలం పాఠాలు మాత్రమే కాకుండా పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి. వాటికి జవాబులు ఎలా రాయాలనే అంశాల్ని సైతం ఈ పుస్తకంలో వివరించారు.
విద్యార్థులు గణిత పాఠాలు అర్థం చేసుకునేందుకు కఠినంగా ఉండే 13 రకాల అంశాలను సులువుగా అర్థమయ్యేలా ఈ పుస్తకం రూపకల్పన చేశారు. కాంతి పరావర్తనం, రసాయన సమీకరణాలు, అమ్లాలు, క్షారాలు, పరమాణునిర్మాణం, భౌతిక, రసాయన శాస్త్రాల్లోని 12 అంశాలను ఇందులో పొందుపరిచారు. జీవశాస్త్రంలో పది రకాల అంశాలు, సాంఘిక శాస్త్రంలో 21రకాల అంశాలను చక్కగా వివరించారు. పాఠ్య పుస్తకాల్లో ఉన్న అంశాలు మాత్రమే కాకుండా అదనపు సమాచారం కూడా ఇందులో ఉందని దాంతో ఉత్తీర్ణత శాతం పెరిగిందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఈ పుస్తకం ద్వారా తరగతి గదిలో చెప్పిన పాఠాల్ని విద్యార్థులు ఇంటి దగ్గర ఎవరి సహాయం లేకుండా నేర్చుకోవచ్చని తెలిపారు.