ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాడేపల్లి కార్యాలయం నుంచే పోస్టులన్నీ పెట్టారు: డీఐజీ - SOCIAL MEDIA POSTS CASE

సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టుల కేసులో డీఐజీ మీడియా సమావేశం - వర్రా రవీందర్‌రెడ్డి, సుబ్బారెడ్డి, ఉదయ్‌రెడ్డిని మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు

SOCIAL_MEDIA_POSTS_CASE
DIG Media Conference on Social Media Posts (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 11, 2024, 5:49 PM IST

Updated : Nov 11, 2024, 8:34 PM IST

DIG Media Conference on Social Media Posts Case: అసభ్యకర పోస్టుల కేసులో అరెస్టయిన వైఎస్సార్సీపీ సోషల్‌ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డితోపాటు మరో ఇద్దరు నిందితులు సుబ్బారెడ్డి, ఉదయ్‌లను పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, హోం మంత్రి అనితతో పాటు పలువురిపై అసభ్యకర పోస్టుల కేసులో నిందితులను పట్టుకునేందుకు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టినట్లు కర్నూల్ రేంజ్‌ డీఐజీ కోయా ప్రవీణ్‌ తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలను కోయా ప్రవీణ్‌, కడప ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు మీడియాకు వివరించారు.

గతంలో భారతి సిమెంట్‌లో పనిచేశాడు: నిందితులు వాడిన భాష దారుణంగా, అసభ్యకరంగా ఉందని డీఐజీ తెలిపారు. సీఎం, డిప్యూటీ సీఎం కుటుంబాలను తీవ్రంగా దూషించారని, అరబ్ దేశాల్లో అయితే మరణశిక్షలు విధించేవారన్నారు. నిందితులను ఆదివారం మార్కాపురం వద్ద అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వర్రా రవీందర్‌రెడ్డి గతంలో భారతి సిమెంట్‌లో పనిచేశాడని డీఐజీ పేర్కొన్నారు. నిందితులు జడ్జిలకు వ్యతిరేకంగా కూడా పోస్టులు పెట్టారని, మహిళల కుటుంబసభ్యులు, వారి పిల్లలపై పోస్టులు పెట్టారని వెల్లడించారు. ఇలాంటి అసభ్యకర పోస్టులు పెట్టేవారిని ఇప్పటివరకు 45 మందిని గుర్తించినట్లు స్పష్టం చేశారు.

తాడేపల్లిలోని కార్యాలయం నుంచి ఇవన్నీ: నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని డీఐజీ అన్నారు. వీరు నాయకుల ఫొటోలు మార్ఫింగ్ చేసి పోస్టులు పెట్టేవారని, నిందితులకు 40 యూట్యూబ్ ఛానళ్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. యూట్యూబ్‌ ఛానళ్ల ద్వారా అసభ్యకర వ్యాఖ్యలు చేసేవారని, తాడేపల్లిలోని కార్యాలయం నుంచి ఇవన్నీ నడిపేవారని వెల్లడించారు. జిల్లా కన్వీనర్ ఆధ్వర్యంలో వీరంతా పనిచేసేవారన్న డీఐజీ, తాడేపల్లిలోని పీవీఆర్ ఐకాన్ బిల్డింగ్‌ నుంచే పోస్టులు పెట్టేవారని పేర్కొన్నారు.

నిందితులు ఇచ్చిన వాంగ్మూలాన్ని లోతుగా పరిశీలించాల్సి ఉందన్న డీఐజీ, నిందితులు పెట్టిన పోస్టులను సాధారణంగా చదవలేమని అన్నారు. సభ్యసమాజం అసహ్యించుకునేలా వారి పోస్టులు ఉన్నాయని, మహిళలపై ఇలాంటి పోస్టులు పెట్టినవారు రాక్షసజాతికి చెందినవారుగా భావిస్తున్నామని చెప్పారు. గతంలో ప్రతిపక్ష నేతల మనోధైర్యం చంపడమే లక్ష్యంగా పోస్టులు పెట్టారని అన్నారు.

వర్రా రవీందర్‌రెడ్డిని కడప తీసుకొచ్చిన పోలీసులు

సజ్జల భార్గవ్ ఆధ్వర్యంలో బూతు పురాణం: సోషల్ మీడియా సైకోలపై ప్రభుత్వం యుద్ధం చేస్తోందని డీఐజీ ప్రవీణ్ తెలిపారు. సోషల్ మీడియాలో వీరి భాష వింటే విదేశాల్లో పబ్లిక్‌గా కొట్టి చంపుతారని అన్నారు. 2020లో సజ్జల భార్గవ్ ఆధ్వర్యంలో బూతు పురాణం ప్రారంభించారని వెల్లడించారు. ఏపీ డిజిటల్ మీడియా కార్పొరేషన్ ద్వారా రూ.8 వేలు తీసుకునేవారని, డిజిటల్ మీడియా కార్పొరేషన్‌లో జీతం తీసుకుంటూ వైఎస్సార్సీపీ పనిచేసేవారన్నారు.

అవినాష్ చెబితే రాఘవరెడ్డి నోట్ చేసుకుని: సజ్జల భార్గవ్ ఆధ్వర్యంలో 400 మంది పనిచేస్తున్నారని తెలిపారు. పంచ్ ప్రభాకర్, వెంకటేష్ బాడీ, బేతంపూడి నాని, కీసర రాజశేఖరరెడ్డి, హరికృష్ణారెడ్డి కల్లంను గుర్తించామన్నారు. విజయవాడ పీవీఆర్‌ ఐకాన్ బిల్డింగ్ కేంద్రంగా కార్యకలాపాలు జరిగాయని వెల్లడించారు. అవినాష్‌ పీఏ రాఘవరెడ్డి ద్వారా సమాచారం తీసుకుని పోస్టు చేసేవారని, అవినాష్ చెబితే రాఘవరెడ్డి నోట్ చేసుకుని రవీందర్‌రెడ్డికి చెప్పేవాడన్నారు. సునీత, షర్మిల ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామన్న డీఐజీ ప్రవీణ్, వర్రా రవీందర్‌రెడ్డిని పోలీసు కస్టడీ కోరతామని తెలిపారు.

పోలీస్ కోవర్టుల కనుసన్నల్లోనే 'వర్రా' పరార్! - తెరవెనుక దాగి ఉన్న షాకింగ్ నిజాలు ఇవే

Last Updated : Nov 11, 2024, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details