Pawan Kalyan Responds to Attack on Galiveedu MPDO:అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై జరిగిన దాడిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని, ఈ దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో ఉన్న జవహర్ బాబుపై వైఎస్సార్సీపీ నేత దాడి చేయడం అప్రజాస్వామిక చర్య అని, ఇటువంటి దౌర్జన్యాలకు, రౌడీ చర్యలకు కూటమి ప్రభుత్వంలో తావు లేదని పవన్ స్పష్టం చేశారు. ఎంపీడీవోపై జరిగిన దాడి గురించి అధికారులతో పవన్ కల్యాణ్ చర్చించారు.
దీనికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత ఎంపీడీవోకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఎంపీడీవోకు, ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పాలని సూచించారు. జవహర్ బాబుపై దాడి చేసినవారికి రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్లా ఏ మాత్రం గౌరవం లేదని అర్థం అవుతోందని దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా బలమైన సంకేతం ఇవ్వాలని చెప్పారు. మండల పరిషత్ కార్యాలయంలో చోటు చేసుకున్న దాడిపై విచారణ చేయడంతోపాటు ఎంపీడీవో ఆరోగ్యం గురించి నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ను పవన్ కల్యాణ్ ఆదేశించారు. వైఎస్సార్సీపీ నేతల దాడిలో గాయపడిన ఎంపీడీవోను పవన్ నేడు పరామర్శించనున్నారు.