Department of Mines Confirmed Gravel Mafia in Guntur District :గత ప్రభుత్వ హయాంలో కొండలు, గుట్టలు కరిగిపోయాయి. ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు కబ్జా చేయడమో లేక మట్టి తవ్వి తరలించడమో చేసేవారు. ముఖ్యంగా గుంటూరు పరిసర ప్రాంతాల్లో మట్టి మాఫియా మరింత రెచ్చిపోయింది. చేబ్రోలు మండలంలో నాణ్యమైన గ్రావెల్ లభిస్తుండడంతో నియోజకవర్గ నేత అండదండలతో వైఎస్సార్సీపీ నేతలు ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇక్కడి నుంచే మట్టి తరలించారు. గోరంత అనుమతులు తీసుకుని కొండంత తవ్వకాలు జరిపారు. పర్యావరణానికి తూట్లు పొడిచి సొంత జేబులు నింపుకున్నారు. అక్రమ మట్టి తవ్వకాలపై స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించినా వైఎస్సార్సీపీ నేతలు లెక్క చేయలేదు.
Huge Gravel Magfia in Guntur :మట్టి మాఫియాకు వ్యతిరేకంగా టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర గట్టిగా పోరాడారు. ఆయన స్వయంగా మట్టి క్వారీల్లోకి వెళ్లి మరీ నిద్రించారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు భూగర్భ గనులశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించిన నివేదిక రూపొందించారు. 2020 నుంచి 2022 వరకూ జరిగిన అక్రమ తవ్వకాలను ఈ నివేదికలో పొందుపర్చారు. వీరనాయకునిపాలెం, శేకూరు గ్రామాల పరిధిలో లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి అక్రమంగా తవ్వి తరలించినట్లు అధికారుల బృందం గుర్తించింది. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం నివేదికను తొక్కిపెట్టింది. కేవలం రెండు గ్రామాల్లోనే ఈ స్థాయిలో అక్రమ తవ్వకాలు జరిగితే మిగతా ప్రాంతాలను పరిశీలిస్తే దోపిడీ తీవ్రత ఏ స్థాయిలో జరిగిందో బయటకు వస్తుందని స్థానికులు అంటున్నారు.
అక్రమార్కులకు అప్పటి ప్రభుత్వ పెద్దలు కొమ్ముకాయడంతో వారిపై చర్యలు తీసుకునేందుకు గనులశాఖ అధికారులు భయపడ్డారు. కేవలం నామమాత్రపు జరిమానాలతో సరిపెట్టారు. 2019 నుంచి 2022 మధ్య అక్రమంగా గ్రావెల్ తవ్వి తరలించే వారి కోటీ పది లక్షలు జరిమానా వసూలు చేయగా ఇవన్నీ ఓవర్‌లోడ్, టార్పాలిన్ కప్పకుండా రవాణా చేసినందుకు విధించిన జరిమానాలే తప్ప అక్రమంగా మట్టి తవ్వకాలు చేసిన విషయంపై మాత్రం చర్యలు తీసుకోలేకపోయారు.