Demolition of Vijayasai Reddy Daughter Illegal Constructions in Bheemili :వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన అక్రమాలను ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం బయట పెడుతుంది. అక్రమ నిర్మాణాలు, కట్టడాలను అధికారులు తొలగిస్తున్నారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఆక్రమిత స్థలంలో కూల్చివేతలు చేపట్టారు. సీఆర్‌జడ్ నిబంధనల ఉల్లంఘనలతో ఈ చర్యలు తీసుకున్నారు.
విశాఖ జిల్లా భీమిలిలో ఆక్రమిత స్థలంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేతకు జీవీఎంసీ (GVMC) నడుం బిగించింది. వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఆక్రమిత స్థలంలో మరోసారి కూల్చివేతలు మొదలు పెట్టారు. సీఆర్‌జడ్ (CRZ) నిబంధనల ఉల్లంఘించిన నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ వేసిన పిల్‌పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో కూల్చివేతలు జరుగుతున్నాయి. కూల్చివేతకు అయ్యే ఖర్చులు నేహా రెడ్డి నుంచి వసూలు చేయాలని న్యాయస్థానం GVMC అధికారులను ఆదేశించింది.
భీమిలిలో సర్వే నంబర్ 1516, 1517, 1519, 1523లో ఉన్న నాలుగు 4 ఎకరాల స్థలంలో అక్రమ కట్టడాలున్నట్టు ఆరోపణలతో హైకోర్టులో పీతల మూర్తియాదవ్ పిల్ వేశారు. ఈ పిల్ పై హైకోర్టు ఉత్తర్వులతో 2 వారాల క్రితమే నిర్మాణాల తొలగింపునకు జీవీఎంసీ అధికారులు శ్రీకారం చుట్టారు. పర్యావరణశాఖ అనుమతులు లేకుండా నేహారెడ్డి నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు. నేహారెడ్డి ఆక్రమిత స్థలంలో కాంక్రీట్ నిర్మాణాలను నెలమట్టం వరకూ కూల్చి వేయాలన్న హైకోర్టు ఆదేశాలతో నేడు మరోసారి జీవీఎంసీ కూల్చివేతలు చేపట్టింది.