Delay in MBBS Counseling AP: ఏపీలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఆలస్యం అవుతోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఆల్ ఇండియా కోటా సీట్లకు మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ, సీట్ల కేటాయింపులు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రస్తుతం రెండో విడత కౌన్సిలింగ్కు ఆప్షన్లు ఇచ్చుకోవాలని ప్రకటన ఇచ్చారు. ఈనెల 17లోగా రెండో విడతకు ఆప్షన్లు నమోదుకు గడువు ఉంది. అయినా ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని రాష్ట్ర కోటా సీట్ల భర్తీకి మొదటి విడత కూడా ఇప్పటివరకూ పూర్తి చేయలేదు.
జాతీయ వైద్య కమిషన్-ఎన్ఎంసీ ఆదేశాల ప్రకారం అక్టోబర్ ఒకటి నుంచే తరగతులు ప్రారంభించాలి. ఈలోగా మొదటి, రెండో విడత కౌన్సిలింగ్ పూర్తి చేయాల్సి ఉంది. ఏపీ విద్యార్థులకు రాష్ట్రంలో మెరుగైన కళాశాలల్లో సీటు దక్కపోతే ఆల్ ఇండియా కోటాలో సీట్ల కోసం ప్రయత్నించే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ జాప్యం జరగడం, ఆల్ ఇండియా కోటా భర్తీ ముందంజలో ఉండడంతో రాష్ట్ర విద్యార్థుల్లో ఆందోళన పెరిగిపోతోంది.
న్యాయ వివాదాలు ప్రకృతి విపత్తులు : ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కలిపి 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆగస్టు 9న ప్రకటన ఇచ్చింది. 35 వైద్య కళాశాలల్లో 3,856 కన్వీనర్ కోటా సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటికోసం 14,000ల మంది విద్యార్థులు అర్జీ చేసుకున్నారు. తర్వాత వివిధ కారణాలతో ప్రవేశాల ప్రక్రియలో తీవ్ర జాప్యం జరిగింది.