Defect in Gammon Bridge Due to Illegal Sand Minings : నిత్యం వేలాదిమంది రాకపోకలు సాగించే గామన్ వంతెన ప్రస్తుతం నిర్వహణ లేమితో ప్రజలకు ప్రాణసంకటంగా మారుతుంది. ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఒక్క ప్రాజెక్టు కట్టకపోగా ఉన్న ప్రాజెక్టులను సైతం పట్టించుకోకపోవడంతో అవి కుంగిపోయే పరిస్థితి వచ్చింది. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోని గోదావరి నదిపై నాలుగు కిలోమీటర్ల మేర 800 కోట్లతో నిర్మించిన గామన్ వంతెన నిర్వహణ లేమితో ప్రాణసంకటంగా మారింది. అధికారుల నిర్లక్ష్యంతో ఓ స్తంభం వద్ద బేరింగ్ కుంగి అంగుళంన్నర మేర ఆ బ్లాక్ కిందకు దిగిపోయింది. వంతెన సమీపంలో డ్రెడ్జింగ్ చేయటమే దీనికి కారణమన్న ఆరోపణలను స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి.
కుప్పకూలిన దేశంలోనే అతిపెద్ద వంతెన- ఒకరు మృతి- 9మందికి గాయాలు
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు-రాజమహేంద్రవరం మార్గంలో ఉన్న గామన్ వంతెనపై 52వ స్తంభం యాక్షన్ జాయింట్ వద్ద ఆదివారం బేరింగ్ కుంగింది. దీంతో దాదాపు అంగుళంన్నర మేర ఆ బ్లాక్ కిందికి దిగిపోయింది. గత కొద్ది నెలలుగా నెమ్మదిగా ఇలా జరుగుతున్నా సంబంధిత అధికారులు గమనించక పోవటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఇంజినీరింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Vibrations on Gammon Bridge : సాధారణంగా బేరింగ్ వ్యవస్థను ఏటా తనిఖీ చేయాలని. ఆ దిశగా ఇక్కడ చేసినట్లు కనిపించడం లేదని NHAకు చెందిన ఓ ఇంజినీరు తెలిపారు. అసలు ఈ సమస్య నిర్మాణంలోనే ఉందా లేక తాజాగా తలెత్తిందా అనే అంశంపై నిపుణులు దర్యాప్తు చేస్తున్నారు. వంతెన బేరింగ్లు కుంగడంతో ప్రస్తుతం ఒకవైపు నుంచి మాత్రమే రాకపోకలు సాగిస్తున్నారు. అయితే వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇబ్బడిముబ్బడిగా ఇసుక తవ్వకాలకు అనుమతిచ్చారు. గామన్ వంతెన సమీపంలో కాతేరు వద్ద 50, కొవ్వూరు వద్ద సుమారు 20 భారీ డ్రెడ్జర్లతో వైసీపీ నాయకులు రేయింబవళ్లు తవ్వేస్తున్నారు.