Dead Body Found in Sand in Bapatla District: రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలకు అంతులేకుండా పోతోంది. కొండలు, గుట్టలే కాదు చివరకు శ్మశానాలను సైతం వదలడం లేదనిపిస్తోంది. ఇప్పటికే ఇసుక తవ్వకాలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీనిపై అనేక సార్లు కోర్టులు సైతం మొట్టికాయలు వేసినా ఇసుకాసురుల తీరు మారడం లేదు.
ఇప్పటికే పలుమార్లు ఇసుకాసురులు శ్మశానాలను సైతం వదలకుండా తవ్వకాలు జరిపిన ఘటనలు చూశాం. దీనిపై రాష్ట్రంలో ఇష్టానుసారం జరుగుతున్న ఇసుక తవ్వకాలపై ప్రతిపక్షనేతలు అనేక సందర్భాలలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా సరే ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా బాపట్ల జిల్లాలో భయభ్రాంతులకు గురిచేసే ఘటన వెలుగులోకి వచ్చింది.
అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట లేకపోవడంతో ఇసుక మాఫియా యథేచ్ఛగా శ్మశానాలను సైతం వదలకుండా అర్ధరాత్రి వేళల్లో ఇసుక వ్యాపారం ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెం పద్మనాభునిపేటలో ఇంటి నిర్మాణం కోసం ఇసుకను తీసుకుని వచ్చారు. అయితే అందులో శవం బయటపడిందని ఇంటి యజమానురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Sand Mafia in graveyard శ్మశానాన్ని వదలని ఇసుకాసురులు.. అస్తిపంజరాలు బయటపడటంతో భయాందోళనలో ప్రజలు
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పద్మనాభునిపేటలో నివాసముంటున్న కాగితాల లక్ష్మి అనే మహిళ నూతనంగా ఇంటి నిర్మాణం చేపట్టారు. అయితే ఇంటి బేస్మెంట్ను పూడ్చేందుకు ఇసుక అవసరం అయింది. దీంతో ఇసుక కావాలని ఆమె ట్రాక్టర్ డ్రైవర్లకు తెలిపింది. ఇసుక దళారులు అక్రమంగా ఇసుక తీసుకొచ్చి పోశారు. ట్రాక్టర్ లో ఇసుక గుట్టగా పోసిన ట్రాక్టర్ డ్రైవర్, అందులో ఉన్న మృతదేహాన్ని గమనించకుండా వెళ్లిపోయాడు.
ఇంటి పని కోసం వచ్చిన బేల్దారి కూలీలు బేస్ మట్టాన్ని నింపేందుకు ఇసుక తీస్తుండగా, ఒక్కసారిగా అందులో నుంచి తల లేని పురుషుడి మృతదేహం బయటపడింది. దీంతో భయభ్రాంతులకు గురైన కూలీలు, వెంటనే ఈ విషయాన్ని ఇంటి ఓనర్‌కి తెలియజేశారు. ఈ ఘటనపై ఇంటి యజమానురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బయటపడ్డ మృతదేహం సుమారు రెండు రోజుల క్రితం పూడ్చిపెట్టి ఉంటారని భావిస్తున్నారు. మొండెం మాత్రమే ఉండటంతో జేసీబీతో ఇసుక తవ్వే క్రమంలో తల ఊడిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు.
అందిన ఫిర్యాదు మేరకు రూరల్ సీఐ నిమ్మగడ్డ సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం ఎక్కడిది? అసలు ఇసుక ఎక్కడ నుంచి తరలించారు? ఏం జరిగింది? అనే తదితర వివరాలను సేకరిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
'జగ్గూ భాయ్' ధనదాహానికి బలైన కోనసీమ- ఎటు చూసినా అంతులేని అవినీతి