YSRCP Govt Schemes Payment Misuse to Pay Followers Bills : పేదల నిధులను వైఎస్సార్సీపీ కాంట్రాక్టర్లకు పందేరం చేసేలా అధికారులు కుట్రలు పన్నుతున్నారు. పోలింగ్‌కు ముందు పథకాల నిధుల విడుదలపై హడావుడి చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఎన్నికల ముగిసి 24 గంటలు దాటినా నోరు మెదపడం లేదు. వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి రాదని తెలిసి, సొంత వారికి నిధులు ఇచ్చేలా అడుగులు వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పేదలకు జనవరి నుంచి పెండింగ్‌లో ఉంచిన రూ. 14,165 కోట్ల డీబీటీ నిధుల చెల్లింపులు నిలిపివేసి వైఎస్సార్సీపీ కాంట్రాక్టర్లకు ఆ సొమ్ములు చెల్లించేందుకు గూడుపుఠాణి సాగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం మే 13న పోలింగ్ ముగిసిన వెంటనే ఆ పథకాలకు నిధులు చెల్లించవచ్చని పచ్చజెండా ఊపింది. పోలింగ్ ముగిశాక తమ నుంచి ఎలాంటి నిరభ్యంతర పత్రమూ తీసుకోవాల్సిన అవసరం లేకుండానే చెల్లింపులు జరపవచ్చని మే 10నే తేల్చిచెప్పింది. జనవరి నుంచి మే మొదటి వారం వరకు సంక్షేమ పథకాల సొమ్ములు లబ్ధిదారులకు చెల్లించకుండా ఆపి, సరిగ్గా పోలింగ్ ముందు చెల్లించకపోతే భూమి తిరగడమే ఆగిపోతుందన్నట్లుగా హడావుడి చేసిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు? కేవలం అధికార వైఎస్సార్సీపీ ఎన్నికల్లో మేలు చేసేందుకే సీఎస్, ఆర్థికశాఖ అధికారులు సర్వశక్తియుక్తులు ఒడ్డారని స్పష్టంగా అర్థమవుతోంది.
పోలింగ్‌కు ముందు ఆ నిధులు లబ్ధిదారులకు అందజేస్తే అధికార పార్టీకి అనుచిత లబ్ధి కలగజేసినట్లు అవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. ఐతే, వైఎస్సార్సీపీ నాయకులు అధికార పార్టీ అనుకూల వర్గాలతో హైకోర్టులో పిటిషన్లు వేయించి, విపక్షాలతోపాటు కేంద్ర ఎన్నికల సంఘంపైనా నోరు పారేసుకున్నారు. కానీ, పోలింగ్ పూర్తై 24 గంటలు గడిచినా ఇంతవరకు లబ్ధిదారులకు నిధులు జమ చేసే ప్రయత్నమే చేయలేదు. ఐతే ఎలాగూ పోలింగ్ ముగియడంతో ఆ డబ్బును వైఎస్సార్సీపీ అనుకూల కాంట్రాక్టర్ల బిల్లులకు చెల్లించే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి.