ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వివేకా హత్యతో గత ఎన్నికల్లో లబ్ది - ఈసారీ అదే కుట్రతో పావులు కదుపుతున్నారు : దస్తగిరి - సీఎం జగన్​పై దస్తగిరి వ్యాఖ్యలు

Dastagiri Comments on CM Jagan: మాజీ మంత్రి వివేకా హత్యను అడ్డుపెట్టుకుని వైఎస్సార్​సీపీ గత ఎన్నికల్లో లబ్ది పొందిందని, ఈసారీ అదే కుట్రతో పావులు కదుపుతున్నారని దస్తగిరి అన్నారు. కడప జైలులో రిమాండ్​ ఖైదిగా ఉన్న దస్తగిరి శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు. అప్రూవర్‌గా మారిన తనను వారివైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారని దస్తగిరి వివరించారు.

dastagiri_comments_on_cm_jagan
dastagiri_comments_on_cm_jagan

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 24, 2024, 8:24 AM IST

Dastagiri Comments on CM Jagan:వివేకా కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి మరోమారు సీఎం జగన్, ఎంపీ అవినాష్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. వివేకా హత్యను అడ్డం పెట్టుకుని గత ఎన్నికల్లో లబ్ధి పొందిన జగన్​మోహన్​ రెడ్డి ఈసారీ అదే కుట్రతో పావులు కదుపుతున్నారన్నారు. వివేకా హత్యలో తాను తప్పుచేసి ప్రాయశ్చిత్తంతో అప్రూవర్​గా మారితే ఇప్పుడు రాజీకి రావాలని వైఎస్సార్​సీపీ పెద్దలు ప్రలోభ పెడుతున్నారని ఆక్షేపించారు.

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్​గా మారిన దస్తగిరి, ఐదేళ్లుగా పులివెందుల వైఎస్సార్​సీపీ నాయకులకు పక్కలో బల్లెంలో మారారు. వారిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తు వస్తున్నారు. అయితే అతనిపై 4 నెలల కిందట యర్రగుంట్ల, వేముల పోలీసులు అట్రాసిటీ, దాడి కేసులు నమోదు చేసి కడప జైలుకు పంపారు. 4 నెలలు రిమాండ్ ఖైదీగా ఉన్న దస్తగిరికి రెండు వేర్వేరు కేసుల్లో హైకోర్టు, కడప జిల్లా కోర్టు బెయిలు మంజూరు చేయడంతో శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు.

మీరు తప్పు చేయకుంటే ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? : దస్తగిరి భార్య షబానా

శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచే అతని భార్య షబానా, పిల్లలు జైలు వద్ద దస్తగిరి కోసం ఎదురు చూశారు. జైలు నుంచి బైటకు వచ్చిన తర్వాత నేరుగా ఆవరణలోని అతిథి గృహంలో ఉన్న సీబీఐ అధికారుల వద్దకు వెళ్లి దస్తగిరి సమాచారం అందించారు. తర్వాత మీడియాతో మాట్లాడిన దస్తగిరి మరోసారి సీఎం జగన్, అవినాష్ రెడ్డిలపై ఆరోపణలు చేశారు. వివేకా కేసులో అప్రూవర్​గా మారి వారికి అడ్డం వస్తున్నాననే ఉద్దేశంతోనే లేనిపోని కేసులు పెట్టి జైల్లో పెట్టారని పేర్కొన్నారు. అరెస్ట్ సందర్భంగా పోలీసులు హింసించారన్నారు. పులివెందులలో తన భార్యను బెదిరించారన్నారు.

"వైఎస్సార్​సీపీ పెద్దలు కుట్రలు పన్ని నన్ను కేసులో ఇరికించారు. అప్రూవర్‌గా మారిన నన్ను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కడప జైలుకు వచ్చి డబ్బు ఆశ చూపించి రాజీకి ప్రయత్నించారు. సీబీఐ ఎస్పీ రాంసింగ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని ప్రలోభపెట్టారు. శివశంకర్‌రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి జైలుకు వచ్చి కలిశారు. వివేకా హత్యలో తప్పుచేసి ప్రాయశ్చిత్తంతో అప్రూవర్‌గా మారాను. మళ్లీ తప్పు చేయాలని జగన్, అవినాష్ ప్రలోభ పెడుతున్నారు. వివేకాను ఎవరు చంపారో చెప్పి ఓట్లు అడిగితే బాగుంటుంది. వివేకాను ఎవరు హత్య చేశారో సిద్ధం సభలోనైనా జగన్ చెప్పాలి." - దస్తగిరి, వివేకా కేసులో అప్రూవర్

వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి ఇంటికి పోలీసుల నోటీసు

వివేకా హత్యలో తప్పు చేసినందుకు ప్రాయశ్చిత్తం పొంది అప్రూవర్​గా మారానని ఇపుడు మళ్లీ తన చేత తప్పు చేయించేలా జగన్, అవినాష్ రెడ్డి కుట్రలు పన్నుతున్నారని దస్తగిరి తెలిపారు. కడప జైల్లో తనకు భారీగా డబ్బు ఆశ చూపి ప్రలోభ పెట్టేందుకు యత్నించారని వెల్లడించారు.

న్యాయస్థానం ఆదేశాల మేరకు జైలు నుంచి దస్తగిరి బయటికి రాగానే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆరుగురు పోలీసులు బందోబస్తుకు వచ్చారు. పులివెందులలోని ఇంటికి చేరుకోగానే అక్కడా పహారా ఏర్పాటు చేశారు.

మొద్దు శీనులాగా తన భర్తను కూడా జైల్లో హతమార్చేందుకు కుట్ర జరుగుతోందని దస్తగిరి భార్య ఆందోళన

ABOUT THE AUTHOR

...view details