Dasara celebrations in Vijayawada 2024 : విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. నాలుగో రోజు లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులను అనుగ్రహించారు. ఆదివారం సెలవురోజు కావడంతో జగన్మాతను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం ప్రారంభమైన రద్దీ ఏ సమయంలోనూ తగ్గుముఖం పట్టలేదు.
ఉచిత దర్శనాలు, వంద, మూడు వందల రూపాయల దర్శనాలతో సమానంగా ఐదు వందల రూపాయల దర్శనాలు, వీఐపీ, ప్రోటోకాల్ దర్శనాలు కొనసాగడంతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడింది. దీంతో స్వయంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన, విజయవాడ పోలీసు కమిషనర్ రాజశేఖరబాబు, ఈవో రామారావు దగ్గరుండి రూ.500ల టికెట్ కొనుగోలు చేసిన భక్తులను ముందుకు నడిపించాల్సి వచ్చింది. ఇందుకోసం అదనపు సిబ్బంది సేవలను కూడా వినియోగించారు. మరోవైపు క్యూలైన్లలో నుంచుని లలితా సహస్రనామ పారాయణాన్ని పఠిస్తూ భక్తులు అమ్మవారి సన్నిధిని చేరుకున్నారు. కోటిసూర్యుల ప్రకాశంతో సమానమైన కాంతి స్వరూపంతో చేతిలో పాశం, అంకుశం, చెరకు విల్లు, పూలబాణాలు ధరించిన జగన్మాత భక్తులను కటాక్షించారు.
Devotees Rush in Indrakeeladri : మరోవైపు దుర్గమ్మ దర్శనానికి సినీ ప్రముఖులు క్యూ కట్టారు. నిర్మాత దిల్రాజు అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. భక్తులను చల్లగా అనుగ్రహించే జగన్మాత సన్నిధికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా బాలీవుడ్ సినీనటి కాదంబరీ జెత్వానీ కుటుంబ సమేతంగా పూజలు చేశారు. అంతరాలయంలోకి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.