Dasara Navaratri Celebrations 5th Day at Indrakeeladri in Vijayawada : ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి మహోత్సవములలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ ఐదో రోజు శ్రీ మహా చండీ దేవి అలంకారములో దర్శనమిస్తున్నారు. దేవతల కార్యసిద్ధి, దుష్టశిక్షణ, శిష్టరక్షణ కొరకు మహాలక్ష్మీ, మహాకాళీ, మహాసరస్వతీ త్రిశక్తి స్వరూపిణిగా శ్రీ మహా చండీ అమ్మవారు ఉద్భవించారు. శ్రీ చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారు. శ్రీ మహా చండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వదేవతలను ప్రార్థించినట్లేనని భక్తుల విశ్వాసం.
శ్రీ అమ్మవారి అనుగ్రహం వలన విద్య, కీర్తి, సంపదలు లభించి శత్రువులు మిత్రులుగా మారటం, ఏ కోరికలతో ప్రార్థిస్తామో ఆ కోరికలు అన్నీ సత్వరమే లభిస్తాయని పండితులు చెబుతున్నారు. గత ఏడాది నుంచి అమ్మవారిని శ్రీచండీదేవిగా అలంకరిస్తున్నారు. చండీదేవి రూపంలో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులను దర్శనాలకు అనుమతిస్తున్నారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు పటిష్టంగా ఏర్పాట్లు చేశారు.
200 మందితో సామూహిక కుంకుమ పూజలు : రాష్ట్రవ్యాప్తంగా శరన్నవకరాత్రి వేడుకలు వైభంగా జరుగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం మండపాకలోని యల్లారమ్మ ఆలయంలో 5వ రోజు దసర శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సర్వ స్వర్ణ ఆభరణాలు, గాజుల హారాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. గోస్తనీ నది తీరంలో కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు అమ్మవారికి గాజులతో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో సుమారు 200 మంది మహిళలు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు.