Cyber Scams in the Name of investments in Amaravati : మేం సూచించిన స్టాక్‌లో పెట్టుబడి పెడితే మంచి ఫలితాలు వస్తాయి, క్రిప్టో ట్రేడింగ్‌లో పెట్టుబడులతో మీరు ఊహించిన దాని కంటే అధికంగా లాభాలు కళ్లజూస్తారు, అని సామాజిక మాధ్యమాల్లో ఊరించే ప్రకటనలతో కేటుగాళ్లు అమాయకులను అమాంతం ముంచుతున్నారు. పెట్టుబడుల పేరుతోనే పెద్ద మొత్తంలో మోసం చేస్తున్న ఘటనలు కృష్ణా జిల్లాలో ఎక్కువగా నమోదవుతున్నాయి. తక్కువ సమయంలోనే ఎక్కువ సంపాదించవచ్చని నమ్మించి నిలువునా ముంచుతున్నారు. ఈ క్రమంలో అధిక రాబడులు వస్తాయనే ఆశతో పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి మోసపోతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
గుణదలకు చెందిన ఓ వ్యక్తికి ఇటీవల వాట్సాప్ గ్రూప్ నుంచి ఓ సందేశం వచ్చింది. అందులో క్రిప్టో కరెన్సీలో ట్రేడింగ్ చేయమని, ఇందులో మంచి లాభాలు వస్తాయని ఇద్దరు వ్యక్తులు ఆశ చూపించారు. బాండ్ జోన్స్ అనే ఓ క్రిప్టో కంపెనీ మేనేజర్‌తో మాట్లాడమని నంబరు ఇచ్చారు. వారు చెప్పినట్లే ఆ నంబరుకు వాట్సాప్ కాల్ చేసి మాట్లాడాడు. అతను క్రిప్టో ట్రేడింగ్‌కు సంబంధించి ఒక లింక్‌ను పంపాడు. బాండ్ జోన్స్ లింక్‌పై క్లిక్ చేసి క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టమని సూచించాడు. ఆ మాటలు నమ్మి, పలు దఫాలుగా ఏడు బ్యాంకు ఖాతాలకు రూ.1.21 కోట్లు దాకా పెట్టుబడి పెట్టాడు. తర్వాత ఈ మొత్తాన్ని డ్రా చేసుకునేందుకు ఫిర్యాదు దారుడు ప్రయత్నించినా సాధ్యం కాని పరిస్థితి. ఈ మొత్తం ఉత్తరాది రాష్ట్రాల్లో వివిధ బ్యాంకుల ఖాతాలకు తరలాయని తెలిసింది. చివరకు తాను మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పది వేలు ఎర వేశారు - సాఫ్ట్వేర్ సొరను ముంచేశారు - IPO షేర్ల పేరిట భారీ మోసం
చిన్న మొత్తాలుగా : పోగొట్టుకుంటున్న సొమ్ము రూ.కోట్లలో ఉంటుండగా, రికవరీ రూ.లక్షల్లోనే ఉంటోంది. దానికి కారణం మోసగాళ్లు దోచిన సొమ్మును అనేక బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తున్నారు. ఒక్కో కేసులో సొమ్మును బట్టి సుమారు 40 నుంచి 100 వరకు ఖాతాలకు చిన్న మొత్తాలుగా విభజించి పంపిస్తున్నారు. అక్రమ లావాదేవీల నిర్వహణకు అమాయకుల బ్యాంకు ఖాతాలను వాడుతున్నారు. వారికి డబ్బు ఆశచూపి మోసగాళ్లే వీటిని నిర్వహిస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో అమాయకులే పట్టుబడుతున్నారు. వీరి పాస్‌బుక్, బ్యాంకింగ్ ఐడీ, పాస్‌వర్డ్‌లను తమ ఆధీనంలోనే ఉంచుకొని అంతా నడిపిస్తున్నారు. వీరెవరికీ తమ ఖాతాల ద్వారా రూ.లక్షల్లో లావాదేవీలు జరుగుతున్నట్లు తెలియదు. ఇందుకు ప్రతి నెలా వారికి కొంత నగదు చెల్లిస్తున్నారు.
దర్యాప్తులో అడ్డంకులు :ఎక్కువ ఖాతాలకు డబ్బు బదిలీ అవుతుండడంతో వీటి వివరాలు తీసుకోవడం పోలీసులకు కష్టంగా మారుతోంది. పైగా అధిక సమయం పడుతుండడంతో దర్యాప్తు, రికవరీకి ప్రతిబంధకంగా ఉంటోంది. చివరకు ఈ నగదుతో మోసగాళ్లు ఈ కామర్స్ సైట్లలో వివిధ వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. చాలా సందర్భాలలో క్రిప్టో కరెన్సీ రూపంలో ఇతర దేశాలకు చేరుతోంది. డబ్బు పోగొట్టుకున్న వెంటనే బాధితులు 1930 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడం లేదు. స్టేషన్‌కు రావడం కూడా ఆలస్యం అవుతోంది. దీని వల్ల రికవరీ శాతం తక్కువగా ఉంటోంది. వేగంగా ఫిర్యాదు చేస్తే 60 శాతం వరకు తిరిగి రాబట్టే అవకాశం ఉంది.
కార్మెల్ నగర్‌వాసి ఒకరు ఓ ప్రైవేటు కంపెనీలో సేల్స్ మేనేజర్. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులపై అవగాహన ఉంది. ఈ మధ్య ‘వెల్త్ క్లాస్‌రూమ్’ అనే వాట్సాప్ గ్రూప్ నుంచి సందేశం వచ్చింది. అందులో కొందరు సభ్యులు తాము ప్రఖ్యాత కంపెనీకి ఆర్థిక సలహాదారులమని పరిచయం చేసుకున్నారు. తాము సూచించిన స్టాక్‌లలో పెట్టుబడి పెడితే 30-40 శాతం లాభాలు వస్తాయని నమ్మబలికారు. నిజమని నమ్మి వారు ఇచ్చిన 13 బ్యాంకు ఖాతాలకు యాప్ ద్వారా రూ.36.72 లక్షల వరకు డబ్బు జమ చేశాడు. యాప్‌లో రూ.1.24 కోట్లు లాభం చూపగా ఆ మొత్తాన్ని డ్రా చేసుకుంటానని పట్టుబట్టడంతో వెంటనే ఆ వాట్సాప్ గ్రూప్‌ను తొలగించారు.
రాష్ట్రంలో పెరిగిపోతున్న సైబర్ నేరాలు - జాగ్రత్తగా లేకుంటే జేబుకు చిల్లే