Cyber Criminals Cheating What App Groups : అనుకోకుండా వాట్సప్ నుంచి వీడియో కాల్ వస్తుంది. ఎవరైన తెలిసిన కాల్ ఏమో అని ఎత్తామా ఇక అంతే సంగతులు. అవతల అందమైన స్త్రీ నగ్నంగా మాట్లాడుతుంది. ఇటుపక్క ఆమె, అటుపక్క బాధితుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న వీడియోని రికార్డు చేస్తారు. ఇక సైబర్ నేరగాళ్లు బెదిరింపులు మొదలుపెడతారు. నగ్న వీడియోను కుటుంబ సభ్యులకు పంపుతామని, తెలిసిన వారుండే గ్రూపుల్లో పెడతామని బాధితుడిని బెదిరించి రూ.లక్షల్లో దోచుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు ఈ కొత్త తరహా దోపిడీకి తెర లేపారు. పోలీసులు ఒక పక్క అవగాహన కల్పిస్తుంటే కొత్త విధానాలతో నేరగాళ్లు తెగబడుతున్నారు. ఇలాంటి కొత్త రకం సైబర్ నేరాలు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో చోటు చేసుకుంటున్నాయి.
లింకులు క్లిక్ చేస్తే ఊడ్చేస్తారు! :ఉచిత డేటా, ఐఫోన్ అంటూ ఊరించే సందేశాలు ఇప్పుడు సర్వ సాధారణం అయ్యాయి. ఇలాంటి సందేశాలతో ఏ మాత్రం ఆశపడి క్లిక్ చేసినా బ్యాంకులో దాచుకున్న సొమ్మునంతా ఊడ్చేస్తారు. ఎవరూ ఏదీ ఉచితంగా ఇవ్వరనే విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలి. ప్రజల మానసిక బలహీనతలు సైబర్ నేరగాళ్లు ఆసరాగా చేసుకోని దోపిడి పాల్పడుతున్నారు. ఆన్‌లైన్ ఉద్యోగం, ఇంటి వద్దే ఉంటూ నెలకు రూ.లక్షకు పైగా సంపాదించవచ్చు, కొన్ని రోజుల వ్యవధిలో పెట్టుబడి రెట్టింపవుతుంది వంటి ప్రకటనలతో ప్రజలను ఊరిస్తున్నారు. ఇటువంటి ప్రకటనలు నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
మీకూ ఇలాంటి కాల్ వచ్చిందా? - ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం!
మోసాలు :ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఈ ఏడాది జులై చివరి నాటికి 292 ఫిర్యాదులు అందాయని సైబర్ పోలీస్ అధికారులు వెల్లడించారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా బాధితులు 1.41 కోట్లు రూపాయలు పోగొట్టుకున్నారని తెలియజేశారు. వీరి ఫిర్యాదుల ఆధారంగా స్పందించిన సైబర్ నేర విభాగం పోలీసులు 25 లక్షల రూపాయలను సైబర్ నేరగాళ్లుకు చేరకుండా బ్యాంక్‌లో హోల్డ్‌లో పెట్టించగలిగారు.