Cyber Crime with Government Officers Fake Whatsapp DP :సైబర్ కేటుగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తుగడలతో దోపిడీకి పథకాలు వేస్తున్నారు. అంతర్జాలంలో దొరికిన సమాచారంతో ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులను నిలువుదోపిడీ చేస్తున్నారు. ఇటీవల ఈ తరహా మోసాలు తరచుగా వెలుగుచూస్తున్నాయి. వాట్సప్,ఫేస్ బుక్ ఖాతాల్లో తమ ఐడెంటిని తెలిపేందుకు ఫొటోలు డీపీలుగా ఉంచుతారు. దీన్ని అవకాశంగా తీసుకుని సైబర్ క్రిమినల్స్ నయా దందా షురూ చేశారు.
హాయ్ ఐ యామ్ ఇన్ మీటింగ్, ఐ నీడ్ మనీ అర్జంట్ : ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉన్నతాధికారుల పేర్లు, ఫొటోలు అంతర్జాలం నుంచి సేకరిస్తున్నారు. ఉన్నతాధికారుల ఫొటోలను వాట్సప్,ఫేస్ బుక్ ఖాతాలకు డీపీలుగా పెడుతున్నారు. నకిలీ వాట్సప్ ఖాతాల నుంచి క్రింది స్థాయి సిబ్బందికి "హాయ్ ఐ యామ్ ఇన్ మీటింగ్, ఐ నీడ్ మనీ అర్జంట్" అంటూ మెస్సేజ్ పంపుతారు. ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడేందుకు ప్రయత్నిస్తే ఫోన్ కట్ చేస్తారు. "నేను మాట్లాడే పరిస్థితుల్లో లేను" తర్వాత డబ్బులు తిరిగి ఇస్తానని తిరుగు సమాధానం పంపుతారు. సిబ్బంది నమ్మే విధంగా మెస్సేజ్ చేసి డబ్బు వసూలు చేస్తున్నారు. ఈ తరహాలోనే ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ ఖాతా తయారు చేశారు.