Couple Suicide Finance Company Harassment in Guntur District :అనుకోకుండా జరిగే ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడంతో కొందరి కలలు చిధ్రమవుతాయి. అనారోగ్యంతో మరి కొందరు ఈ లోకాన్ని వీడాల్సి వస్తుంది. కానీ అన్నీ సరిగ్గా ఉండి, చిన్న చిన్న సమస్యలకే జడిసి జీవితాల్ని చీకటి చేసుకునే వారు అనేకం. ఈ తరహాలోనే ఆర్ధిక సమస్యలు బాపట్ల జిల్లాకు చెందిన ఓ రైతు కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాయి.
బాపట్ల జిల్లాలో చదలవాడకు పోలిశెట్టి శ్రీనివాసరావు రైతు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇద్దరు పిల్లలు. కుమార్తె బీటెక్ పూర్తి చేయగా, కుమారుడు ఇంటర్ చదువుతున్నాడు. అవసరాలరీత్యా ఓ ప్రైవేట్ కంపెనీలో రూ.15 లక్షలు రుణం తీసుకున్నారు. నెలనెలా కిస్తీలు కడుతున్నాడు. కానీ సాగులో నష్టం రావడం, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో రెండు నెలల నుంచి వాయిదాలు చెల్లించడం లేదు. దీంతో ఫైనాన్స్ కంపెనీ అప్పు చెల్లించాలని ఒత్తిడి చేసింది. సంస్థ ప్రతినిధులు ఇంటికి వచ్చి డబ్బు చెల్లించాలని వేధించారు. అంతటితో ఆగకుండా ఇంటికి నోటీసులు అంటించారు. దీన్ని శ్రీనివాసరావు అవమానంగా భావించాడు. అంతే ఇలాంటి పరిస్థితిలో దిక్కుతోచక భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు.
పోలిశెట్టి శ్రీనివాసరావు భార్య పుష్పలతతో సహా గుంటూరు జిల్లా నారాకోడూరు వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. భార్య అక్కడికక్కడే చనిపోగా, శ్రీనివాసరావు జీజీహెచ్లో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. తల్లిదండ్రుల మరణ వార్త విని ఇంటర్ చదువుతున్న కుమారుడు లిఖిత్ కుమార్ షాక్కు గురయ్యాడు. అంతేకాదు పక్షవాతం బారిన పడ్డాడు. ప్రస్తుతం తెనాలి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుమార్తెకు విషయం తెలిసి దిక్కుతోచని స్థితిలో పడింది. కన్నవారిని కోల్పోవడంతో పాటు సోదరుడు మంచానికే పరిమితం కావడంతో గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో తల్లిదండ్రుల మృతదేహం వద్ద కుమార్తె ఒంటరిగా రోదిస్తున్న ఘటన స్థానికులను కలిచివేసింది.