నియోజకవర్గానికి 70 కోట్ల పైమాటే! - ఎంత ఖర్చు అయినా పర్లేదు కొనేయ్! - (ETV Bharat) Costliest Elections: ఐదేళ్లుగా అవినీతి, అక్రమాలతో ఆ పార్టీ నేతలు పోగేసిన నోట్లు 'కట్టలు' తెంచుకుంటున్నాయి. ఎంత రేటయినా పర్లేదు ఓటరును కొనేయడానికి సిద్ధమంటున్నాయి. ప్రజల్ని, ప్రకృతి వనరుల్ని దోచేసి పోగేసిన ఆ డబ్బులను ప్రజాభిప్రాయాన్ని మార్చేయడానికి చేతులు మారుతున్నాయి. ఓటరును ప్రలోభపెట్టి మరోమారు అధికారంలోకి వచ్చి అందినకాడికి దోచేయాలనుకుంటున్న నేతల కోసం కరెన్సీ కాగితాలు కదనరంగంలో కాలు దువ్వుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి 18 వేల కోట్లు ఖర్చు పెట్టడం దేశ చరిత్రలోనే ఎక్కడా లేదు. శుక్రవారం నుంచే ఆ పార్టీ ఇంటింటి తలుపు తడుతోంది. ఎవరైనా తమకు వద్దంటే దాడులకూ తెగబడుతోంది.
కొన్ని కీలక నియోజకవర్గాల్లో 100 కోట్లు పెట్టేందుకూ వెనకాడటం లేదు. ఎక్కడ చూసినా బస్తాలకొద్దీ నోట్ల కట్టలే. ఎవరైనా తనిఖీ ఆఫీసర్లు వస్తున్నారంటే ఒకటి, రెండు బస్తాలు అక్కడే విసిరేసి వెళ్లేందుకూ వెనకాడటం లేదంటే డబ్బంటే ఎంత లెక్కలేనితనమో అర్థం చేసుకోవచ్చు. వివిధ స్థాయిల నాయకులకు ప్యాకేజీ కింద లక్షల నుంచి కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం 20 కోట్ల విలువైన మద్యం నిల్వలు పెట్టి ఓటర్లను మత్తులో ముంచేస్తున్నారు. ఈ డబ్బంతా తిరిగి సంపాదించుకోవడానికి మరెన్ని అవినీతి యజ్ఞాలు చేస్తారో, ఎన్ని లక్షల మంది ఆస్తుల్ని లాగేసుకుంటారో?
రాష్ట్రవ్యాప్తంగా 46,389 కేంద్రాలు, 4.14 కోట్ల ఓటర్లు - ప్రశాంత పోలింగ్‌పై ఈసీ నజర్ - AP ELECTIONS 2024
పది రూపాయలిస్తే మీరు ఇరవై ఇచ్చేయండి: అయిదు సంవత్సరాలుగా పదేపదే అబద్ధాలతో ప్రజల్ని నమ్మిస్తూ వచ్చిన ఆయన ఇంతకాలం తన మాటల్ని వారంతా నమ్మేశారనే భ్రమల్లో తేలిపోయారు. ఎన్నికల దగ్గరకొచ్చేసరికి, తన స్వరూపం ప్రజలకు తెలిసిపోవడంతో ఆలోచనలో పడ్డారు. సొంత సంస్థల సర్వేలతో పాటు జాతీయ సంస్థలూ ప్రతికూల ఫలితాలు ఖాయమనే సంకేతాలు ఇస్తుండటంతో, ముఖ్యనేత ఆలోచనలో పడ్డారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోవడంతో ఇక అడ్డదారుల్లో పోగేసిన డబ్బునే నమ్ముకుని రాజకీయం ప్రారంభించారు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి పది రూపాయలిస్తే మీరు ఇరవై ఇచ్చేయండి అని కుమ్మరింపులు ప్రారంభించారు. నేతలు, కార్యకర్తల కొనుగోలుకూ వెనకాడవద్దంటూ తమ నాయకులకు సూచించారు.
కొనుగోళ్లు, పంపిణీలో భాగంగా నియోజకవర్గానికి 70 కోట్ల చొప్పున తరలించి, అక్కడి నేతలకు అప్పగించారు. సభలకు సైతం స్వస్తిచెప్పి, ఎక్కడెక్కడ పంపిణీ ఎలా ఉంది? గెలవాలంటే ఇంకా ఎంత అవసరమనే సమీక్షలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 4కోట్ల14లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఒక్కో నియోజకవర్గంలో సగటున 2లక్షల30 వేల మంది ఓటర్లుండగా అందులో కనీసం 65% మందికైనా డబ్బు పంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు బూత్‌ల వారీగా ఏ ప్రాంతంలో ఎంతెంత మంది ఓటర్లు ఉన్నారు? అందులో ఎందరికి ఎంత సొమ్ము పంపిణీ చేయాలి అనేది లెక్కలేసి మరీ సిద్ధం చేసి పంపిణీ ప్రారంభించారు.
పోలింగ్ నిర్వహణకు సన్నద్ధం :ముఖేశ్ కుమార్ మీనా - AP CEO Mukesh
మండలాల్లో ఒక మాదిరి పట్టున్న నేతకు 2 కోట్లు, ఒకటి, రెండు మండలాల్లో ప్రభావం చూపగలిగితే వారైతే కోటి, మండలస్థాయి నాయకుడైతే 50 లక్షలు, కులసంఘాలను ప్రభావితం చేసేవారికి 25 నుంచి 50 లక్షల వరకూ ప్యాకేజీగా ఇస్తున్నారు. డిమాండ్‌ను బట్టి మరికొన్ని చోట్ల ఇంకా ఎక్కువ కూడా చెల్లిస్తున్నారు. మేజర్ పంచాయతీ స్థాయి నాయకులకు 50 లక్షలు, ఓ మాదిరి పంచాయతీల నాయకులకు 20 లక్షలు, ఇంకా చిన్న పంచాయతీలకు 10 లక్షల చొప్పున ఇస్తున్నారు. కాలనీలు, అపార్ట్‌మెంట్ల సంఘాలకు, అందులోని ఓటర్లను ప్రభావితం చేసేవారికి ఓట్లను బట్టి ప్యాకేజీ నిర్ణయించి చెల్లిస్తున్నారు. ఎక్కడా చిన్నపాటి అవకాశాన్నీ వదలకుండా కొనుగోళ్ల పర్వం కొనసాగిస్తున్నారు.
మద్యం కోసం ఒక్కొక్కరికీ 300 నుంచి 500: జే బ్రాండ్లు, గోవా మద్యం వద్దంటూ అందరూ తిరస్కరించడంతో, కేవలం మద్యం కోసం ఒక్కొక్కరికీ 300 నుంచి 500 వరకూ డబ్బులు చేతికి అందిస్తోంది. ఇలా రోజూ వేలమందికి పంపిణీ చేస్తోంది. కోస్తాలోని ఓ నియోజకవర్గంలో మద్యం పంపిణీకే రోజుకు 20 నుంచి 30 లక్షల వరకూ వెచ్చిస్తోంది. గెలుపు అవకాశాలు రోజురోజుకూ సన్నగిల్లుతుండటంతో, ఓటు రేటును పెంచేస్తున్నారు. తొలుత 3వేల చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించారు. కొన్ని కీలక నియోజకవర్గాల్లో 4వేలు ఇస్తున్నారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేశ్ వంటి ముఖ్యనేతలు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లో శుక్రవారం నుంచి 5 వేల చొప్పున ఇస్తున్నారు. ప్రత్యర్థులు ఇచ్చే డబ్బులకు అనుగుణంగా 2వ విడతగా మరికొంత ఉంటుందని హామీలిస్తున్నారు. అక్కడ ఎంతైనా ఖర్చు పెట్టి మెజారిటీని తగ్గించడమే లక్ష్యంగా నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా చివరిరోజు మరింత సొమ్ము కుమ్మరించేందుకూ సిద్ధమైంది.
ప్రయాణికులతో కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు- 2 వేల ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ - Heavy Rush At Bus Stations
ఎంత ప్రయత్నం చేసినా గెలిచే అవకాశం లేదని తేలిన కొన్ని నియోజకవర్గాల్లో డబ్బుల పంపిణీపై ఆ పార్టీ చేతులెత్తేసింది. ఉత్తరాంధ్ర, కోస్తాలోని పలు నియోజకవర్గాల్లో ఎంత సొమ్ము ఖర్చు చేసినా ఉపయోగం ఉండదని తాము చేయించిన సర్వేల్లోనే తేలింది. దీంతో శుక్రవారం నుంచి వ్యూహం మార్చారు. అక్కడ ఓటుకు వెయ్యి ఇస్తే సరిపోతుందని నిర్ణయించారు. మిగిలిన సొమ్మును రాయలసీమలో గట్టి పోటీ ఉండే నియోజకవర్గాలకు తరలిస్తున్నారు. రెండు రోజులుగా ఈ వ్యవహారం జోరుగా సాగుతోంది. రాయలసీమలోనూ గతంలో తేలిగ్గా విజయం సాధించిన నియోజకవర్గాల్లో ఈ దఫా అంచనాకు మించి భారీగా ఖర్చు చేయక తప్పదని ఆ పార్టీ నేతలే పేర్కొంటున్నారు.
ఈ పార్టీ అవినీతి చరిత్ర రాష్ట్రంలోని ఓటర్లందరికీ అర్థమైంది. నగదు పంపిణీకి ఇంటి వద్దకు వచ్చే నేతలు 2నుంచి 3 వేలు ఇస్తామని చెబుతున్నారు. దీంతో ఓటర్లలోనూ తిరుగుబాటు మొదలవుతోంది. ''అన్నిచోట్లా ఓటుకు 5 వేలు ఇస్తున్నారంటున్నారు. మీరేమో 2వేలిచ్చి మిగిలింది నొక్కేస్తున్నారా?'' అని నిలదీస్తున్నారు. ''అయినా అదంతా మా డబ్బేగా ఓటుకు 5 వేలు ఇవ్వండి'' అని డిమాండు చేస్తున్నారు. తమ పార్టీ సానుభూతిపరులు కారంటూ కొన్నిచోట్ల డబ్బు ఇవ్వడం లేదు. దీంతో అలాంటివారు వీధుల్లోకి వచ్చి తమకెందుకు డబ్బు ఇవ్వరని నేతలను నిలదీస్తున్నారు. దీంతో విస్తుపోవడం పార్టీనేతల వంతవుతోంది.
ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న ఓటర్లు - బస్సులు లేక అవస్థలు - Bus congestion in AP