Telangana Govt Focus on Dharani Problems :ధరణితోపాటు భూ వ్యవస్థలను సమగ్రంగా ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పుడున్న ఆర్వోఆర్ చట్టాన్ని సవరించేందుకు బదులుగా భూములకు సంబంధించిన చట్టాలన్నీ కలిపి సమగ్రంగా ప్రత్యేక చట్టం చేసే దిశగా కసరత్తుచేస్తోంది. ఈ మేరకు ముసాయిదా బిల్లును సిద్ధం చేస్తున్న సర్కార్ వచ్చే నెలలో జరగనున్న బడ్జెట్ సమావేశాల్లోనే ఆమోదించాలని యోచిస్తోంది.
ధరణి పేరుని భూమాతగా మార్చనున్నారు. భూమాత పోర్టల్‌లో ఇప్పుడున్న మాడ్యూళ్ల సంఖ్యని వీలైనంత వరకు తగ్గించి సామాన్యులకు సులభంగా అర్థమయ్యేలా తీర్చిదిద్దేలా కసరత్తు చేస్తోంది. పోర్టల్ నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకుండా ప్రభుత్వానికి చెందిన ఎన్ఐసీ లేదా సీజీజీ లేదా టీఎస్ ఆన్‌లైన్‌కి అప్పగించే అవకాశం కనిపిస్తోంది. సమస్యను బట్టి తహసీల్దార్ల నుంచి సీసీఎల్ఏ పరిష్కార బాధ్యతలు అప్పగించనున్నారు. రెవెన్యూ ట్రైబ్యునళ్లని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ధరణిపై ఏర్పాటు చేసిన కమిటీ సూచనలతో ప్రభుత్వం వాటిని పరిశీలిస్తోంది. ఆ కమిటీ త్వరలోనే తుది నివేదిక ఇవ్వనుంది.
Dharani Portal Issues in Telangana: తుది నివేదిక సమర్పించే ముందే కమిటీ సిఫార్సులపై జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ కానున్నారు. ఇప్పటికే కమిటీ సభ్యులతో రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమావేశమై సిఫార్సులపై చర్చించారు. ధరణి పోర్టల్‌ను పునర్‌వ్యవస్థీకరించి భూ సంబంధిత చట్టాల్లో మార్పులు చేసేదిశగా చర్యలు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. అందరికీ సులువుగా అందుబాటులో ఉండేలా పోర్టల్‌లో మార్పులు చేర్పులు చేస్తామని చెప్పారు.
ధరణి పోర్టల్ ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టాం : మంత్రి పొంగులేటి - Minister Ponguleti on Dharani
అధికారంలోకి వచ్చిన కొన్నిరోజులకే ధరణి సమస్యలపై దృష్టిసారించిన తెలంగాణ సర్కార్ జనవరి 9న ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కిసాన్ కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి రేమండ్‌పీటర్, న్యాయవాది సునీల్, విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్ సభ్యులుగా సీసీఎల్ఏ నవీన్ మిత్తల్ కన్వీనర్‌గా ఏర్పాటైన కమిటీ నిపుణులు, అధికారులతో చర్చించింది. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లోని ఆర్వోఆర్ చట్టాలను పరిశీలించింది. క్షేత్రస్థాయిలో పర్యటించి పలు సమస్యలు గుర్తించి ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక సమర్పించింది.
మాడ్యుళ్లలో మార్పులు :రాష్ట్రంలో 2020లో అమల్లోకి వచ్చిన ఆర్వోఆర్ చట్టంలోనే లోపాలున్నాయని ధరణి కమిటీ తేల్చింది. హడావుడిగా భూసమగ్ర సర్వే చేసి ఆ రికార్డులను ప్రామాణికంగా తీసుకోవటంతో సమస్యలు, రికార్డుల వివాదాలు పెరిగాయని కమిటీ భావిస్తోంది. పేర్లలో చిన్న అక్షర దోషాలున్నా సరిదిద్దుకునేందుకు కలెక్టర్ వరకు వెళ్లాల్సి వస్తోందని కమిటీ తెలిపింది. ధరణిలో 35 మాడ్యుళ్లు ఉండటంతో ఏ సమస్యకు ఏ మ్యాడ్యూల్‌లో దరఖాస్తు చేసుకోవాలో అర్థం కాక రైతులు ఇబ్బంది పడుతున్నట్లు కమిటీ పరిశీలనలో తేలింది.