Congress Party Focus On Nominated Posts :రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో బిజీ బిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులు పార్టీ పదవుల భర్తీపై దృష్టి సారించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రోజు రోజుకు ఒత్తిళ్లు పెరుగుతుండడంతో పార్టీ కోసం పని చేసిన వారితో భర్తీ చేయాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.
మొదటి విడతలో 37 మందికి వివిధ కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించిన పార్టీ రాష్ట్ర నాయకత్వం మరికొంత మందికి రెండో విడత కింద కార్పొరేషన్ ఛైర్మన్ల పదవులు ఇచ్చేందుకు సిద్దమవుతోంది. సామాజిక సమతుల్యత పాటించి ఈ పదవులు భర్తీ చేయాల్సి ఉంది. డిమాండ్ అధికంగా ఉండడంతో పార్టీ నాయకత్వం ఆచితూచి ముందుకు పోతోంది.
పార్టీకోసం పనిచేసిన వారికే పదవులు :పార్టీ బలోపేతానికి పని చేసిన వారికే పదవులు దక్కాలన్న యోచనలో కాంగ్రెస్ కసరత్తు కొనసాగుతోంది. అదేవిధంగా ఎమ్మెల్యేలకు కూడా కొన్ని కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఇచ్చే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఆర్టీసీ, పౌరసరఫరాలు, మూసీ సుందరీకరణ కార్పొరేషన్ తదితర ముఖ్యమైన పదవులు ఎమ్మెల్యేలకు ఇస్తారన్న ప్రచారం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా వాటికంటే ముందు కమిషన్లు ఏర్పాటు చేయాలని యోచిస్తున్న పార్టీ నాయకత్వం వాటి కసరత్తులో కూడా వేగం పెంచినట్లు తెలుస్తోంది. విద్యా కమిషన్ ఛైర్మన్‌గా మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి, రైతు కమిషన్ ఛైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, బీసీ కమిషన్ ఛైర్మన్‌గా పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ల ఎంపిక పూర్తి చేసినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సామాజిక వర్గాల సమతుల్యత పాటించే విధంగా :బీసీ కమిషన్‌ను అధిక జనాభా కలిగిన బీసీ వర్గాలతో ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ప్రధానంగా ఇందులో మున్నూరు కాపు, యాదవ, గౌడ్, ముదిరాజులు లాంటి అత్యధిక జనాభా కలిగిన వారు ఛైర్మన్, సభ్యులు ఉండేట్లు చూడాలని యోచిస్తోంది. అదేవిధంగా విద్యా కమిషన్ ఛైర్మన్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఐఏఎస్ మురళిని నియమిస్తుండడంతో విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చే దిశలో పని చేయగలిగే వారిని సభ్యులుగా నియమించేందుకు కసరత్తు జరుగుతోంది.