Tourists in Sangam Barrage : నెల్లూరు జిల్లా సంగం వద్ద పెన్నానదిలో బీరాపేరు, బొగ్గేరు వాగులు సంగమించే సంగమ స్థానం జలసౌందర్యానికి నిలయంగా ఉంది. ఇక్కడి సాగునీటి పరవళ్లను కనులారా తిలకించి ప్రజలు ఆనందిస్తుంటారు. బ్యారేజి నిర్మాణం తరువాత పర్యటకుల సంఖ్య భారీగా పెరింది. దుష్టసంహారం కోసం పరమేశ్వరుడు వినియోగించే ధనస్సును 'పినాక' అంటారు.
కర్ణాటక రాష్ట్రంలో నంది పర్వత సానువుల్లో ఉద్భవించిన నది శివుడి విల్లు 'పినాక' ఆకారంలో ఉండటంతో దాన్ని పెన్నానది అని పిలుస్తున్నారు. దానిలో సంగం వద్ద బీరాపేరు, బొగ్గేరు అనే రెండు వాగులు సంగమిస్తుంటాయి. దాంతో ఈ సంగమ స్థానం కాలక్రమేణా సంగంగా మారింది.
పురాతనమైన ఆనకట్ట:పెన్నానది జలాలను వృథాగా సముద్రంలో కలవకుండా సద్వినియోగం చేసేందుకు 1882-85 మధ్య కాలంలో సంగం వద్ద పెన్నానదికి అడ్డుగా 1242 మీటర్ల పొడవైన ఆనకట్ట నిర్మించారు. దక్షిణాసియా ఖండంలో ఇప్పటికీ అదే అత్యంత పురాతనమైన జలవనరుల కట్టడంగా పేరు పొంది ప్రస్తుతం నీటిలో మునిగింది.
దిగువన ప్రత్యేకం:సాధారణంగా పురాతన కట్టడానికి ఎగువ భాగంలో నూతన నిర్మాణం చేస్తారు. సంగంలో మాత్రం విభిన్నంగా సంగం ఆనకట్టకు దిగువన 450 మీటర్ల దూరంలో 1200 మీటర్ల పొడవైన బ్యారేజి నిర్మాణం జరగడం విశేషం. అనుబంధంగా కనిగిరి జలాశయం ప్రధాన కాలువ, కనుపూరు, నెల్లూరు చెరువు, దువ్వూరు, బెజవాడ పాపిరెడ్డి కాలువలున్నాయి.
రహదారులు ఆభరణాలుగా:నెల్లూరు-ముంబయి జాతీయ రహదారి, సంగం- కలిగిరి రహదారులను ఆభరణాలుగా కలిగిన సంగం కొండ పచ్చదనంతో కళకళలాడుతూ అత్యంత సుందరంగా ప్రయాణికులను, ప్రజలకు ప్రత్యేక ఆకర్షణగా ఉంది.