Common Universities Act Coming Soon in AP :విద్యార్థులకు మెరుగైన విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేలా విశ్వవిద్యాలయాలు అన్నిటినీ ఒకే చట్టం పరిధిలోకి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం వేర్వేరు చట్టాలున్న యూనివర్శిటీలను చట్టసవరణ ద్వారా ఒకే చట్టం పరిధిలోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. వర్శిటీల పాలకమండళ్ల స్థానంలో బోర్డు ఆఫ్ గవర్నర్స్‌ను తెచ్చి పారిశ్రామికవేత్తలను భాగస్వామ్యం చేసేందుకు సిద్ధమైంది. ఆర్జీయూకేటీ కులపతిగా గవర్నర్‌కే బాధ్యతలు కట్టబెట్టాలని భావిస్తోంది.
ఒకే చట్టం దిశగా అడుగులు :విద్యావ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతవిద్యను ప్రక్షాళన చేసేందుకు సిద్ధమైంది. అన్ని విశ్వవిద్యాలయాలకు ఒకే చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల చట్టానికి సవరణలు చేయనుంది. ఉన్నత విద్యాశాఖ పరిధిలో 20 విశ్వవిద్యాలయాలు ఉండగా వీటికి వేర్వేరు చట్టాలు ఉన్నాయి. వీటన్నింటిని కలిపి ఒకే చట్టంగా మార్చేందుకు చట్ట సవరణచేసే బాధ్యతను ఉన్నత విద్యామండలికి ప్రభుత్వం అప్పగించింది. డిసెంబరులోపు కొత్త చట్టం రూపొందించాలని ఆదేశించింది.
అందినకాడికి దోచుకున్నారు - అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చారు - Nuziveedu IIIT present situation
సీఎం స్థానంలో మళ్లీ గవర్నర్ : ఆర్జీయూకేటీ, పద్మావతి మహిళ, ద్రవిడ, జేఎన్‌టీయూ, క్లస్టర్, ఉర్దూ విశ్వవిద్యాలయాలకు వేర్వేరు చట్టాలున్నాయి. మిగిలిన సాధారణ విశ్వవిద్యాలయాలకు ఒక చట్టం అమల్లో ఉంది. వీటిని ఒకే చట్టం పరిధిలోకి తీసుకొస్తే ఏపీ విశ్వవిద్యాలయాల చట్టంగానే పరిగణిస్తారు. ట్రిపుల్‌ఐటీల (IIIT) కోసం రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ప్రత్యేక చట్టం ఉంది. అన్ని వర్సిటీలకు గవర్నర్ కులపతి కాగా ఈ వర్సిటీకి మాత్రం కులపతిని ప్రభుత్వమే నియమిస్తోంది. వైఎస్సార్సీపీ హయాంలో ఈ చట్టానికి సవరణ చేసి కులపతిగా సీఎం ఉండేలా మార్పు చేశారు. చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం లభించినప్పటికీ గెజిట్ నోటిఫికేషన్ జారీ కాలేదు. ఇప్పుడు రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయానికి గవర్నర్ కులపతిగా ఉండేలా చట్ట సవరణ చేసే అవకాశం ఉంది.