Samagra kutumba survey In Telangana 2024 : తెలంగాణలో రెండో దశ సమగ్ర కుటుంబ సర్వే నేటి (శనివారం) నుంచి జరగనుంది. కుటుంబ వ్యక్తిగత వివరాలను గణకులు (ఎన్యూమరేటర్లు) సేకరిస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల కోసం స్వగ్రామంలోని ఇల్లు వదిలి దూర ప్రాంతాల్లోని పట్టణాలు, నగరాల్లో నివసించే వారికి ప్రభుత్వం వెసులుబాటు కలిగించింది. ఒక కుటుంబం ప్రస్తుతం ఎక్కడ నివసిస్తుంటే, అక్కడే గణకుల వద్ద తమ వివరాలను నమోదు చేయించుకునే అవకాశం ఇచ్చింది.
ఆధార్ కార్డులో చిరునామా ఉన్న చోటికి, స్వగ్రామానికి వెళ్తేనే కుటుంబ వివరాలు నమోదు చేస్తారనే అపోహ పడవద్దని రాష్ట్ర ప్రణాళిక శాఖ తెలిపింది. సర్వేలో కుటుంబ సభ్యుల వ్యక్తిగత ఆధార్, సెల్ఫోన్ నంబర్లు, ప్రశ్నపత్రంలో అడిగిన వివరాలన్నీ తెలపాలి. ఆధార్, రేషన్ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంకు పాసు పుస్తకం వంటివి అందుబాటులో ఉంచుకుంటే సర్వే కోసం వచ్చిన గణకులకు త్వరగా సమాచారం ఇవ్వవచ్చని అధికారులు తెలిపారు.
ఈ నెల 6వ తేదీ నుంచి 8 వరకు ఇంటి నంబరు, యజమాని పేరు నమోదు సర్వే పూర్తి చేశారు. ఒక్కో గణకుడికి 150 నుంచి 175 ఇళ్ల దాకా కేటాయించడంతో వీటి నంబర్ల నమోదుకు బుధ, గురు, శుక్రవారాల వరకు ప్రభుత్వం సమయం ఇచ్చింది. ఇంకా పట్టణాలు, నగరాల్లో అక్కడక్కడా కొన్ని ఇళ్లు మిగిలి ఉన్నాయి. వాటి వివరాల నమోదు శనివారం పూర్తి చేస్తారు. వీటి ఆధారంగా ప్రతి ఇంటికీ వెళ్లి కుటుంబంలోని సభ్యులందరికి సంబంధించిన వివరాల నమోదును నేటి నుంచి ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది.
తెలంగాణలో మొత్తం 1,17,44,954 కుటుంబాలు ఉన్నాయని, అన్ని ఇళ్లను 87,092 ఎన్యూమరేషన్ బ్లాక్‌లుగా విభజించినట్లు ప్రణాళిక శాఖ వివరించింది. హైదరాబాద్‌లో మొత్తం 28,32,490 కుటుంబాలు ఉన్నాయి. వీటిని 19,328 ఎన్యూమరేషన్ బ్లాక్‌లుగా విభజించారు. సర్వే పూర్తి చేయడానికి 94,750 మంది గణకులను, వారిపై 9,478 మంది సూపర్‌వైజర్లను, ప్రభుత్వం నియమించింది.