Coastal Andhra Districts Experiencing Heavy Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. పొంగిన వాగులు, గెడ్డలు రోడ్లు, పొలాలను ముంచెత్తాయి. చాలా ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. వాన తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు, అత్యవసరం ఉంటేనే ప్రజలు ఇళ్లనుంచి బయటికి రావాలని సూచించారు.
దిగువ ప్రాంతాలు అప్రమత్తం :కాకినాడ జిల్లా ఏలేశ్వరంలోని ఏలేరు జలాశయం నుంచి 5500 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. ఎగువ నుంచి వచ్చిన 11 వేల 831 క్యూసెక్కుల నీరు ఏలేరు జలాశయానికి చేరింది. రిజర్వాయర్ నీటి మట్టం 86.56 మీటర్లు కాగా ప్రస్తుతం 85.05 మీటర్లు ఎత్తున నీరు చేరుకుంది. మరో వైపు అప్పన్నపాలెం కాజెవే బ్రిడ్జి మరోసారి కుంగిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పరిశీలించి దిగువ ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.
ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్ - విశాఖలో విరిగిపడుతున్న కొండచరియలు - red alert for north andhra
వరద గుప్పిట్లో లంక గ్రామాలు : కోనసీమ జిల్లాలోని లంక వాసులను వరద భయం వెంటాడుతుంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించినా సముద్రంలోకి 9 లక్షల క్యూసెక్కుల వరద నీటిని వదులుతున్నారు. దీంతో లంక గ్రామాల ప్రజలు ఎప్పుడు వరద ముంచెత్తుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా గురజాపులంక పల్లంవారిపాలెం ప్రాంతంలో వరదకు లంక భూములు ముంపునకు గురయ్యాయి. ఇంటి సమీపంలోనే నేల కోతకు గురవుతుండటంతో పశువులను రక్షించుకునేందుకు లంక గ్రామాల ప్రజలు వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.