Telangana TET Results Released 2024 :ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. హైదరాబాద్‌లో ఆయన ఈ ఫలితాలను ప్రకటించారు. మొత్తం 2,86,381 మంది అభ్యర్థులు ఇందుకోసం దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. పేపర్-1పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరుకాగా, 57,725 మంది ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు. పేపర్-2కు 1,50,491 మంది హాజరయ్యారని, వారిలో 51,443 అభ్యర్థులు అర్హత సాధించారని అధికారులు వివరించారు.
పేపర్-1లో 67.13 శాతం, పేపర్-2లో 34.18 శాతం మంది అర్హత సాధించారని అధికారులు పేర్కొన్నారు. 2023తో పోలిస్తే పేపర్-1లో 30.24 శాతం పేపర్-2లో 18.88 శాతం ఉత్తీర్ణత పెరిగిందని చెప్పారు. ఫలితాలను https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని అధికారులు వివరించారు. టెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
టెట్ అర్హత కాలపరిమితి జీవితకాలం ఉంటుంది. పేపర్-1లో ఉత్తీర్ణులైన వారు ఒకటి నుంచి అయిదు తరగతులకు బోధించే ఎస్జీటీ పోస్టులకు, పేపర్-2కు అర్హత సాధించిన అభ్యర్థులు ఆరు నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు. మరోవైపు టెట్ దరఖాస్తుల సమయంలో ఎన్నికల కోడ్ కారణంగా పరీక్ష అర్జీ ఫీజు తగ్గింపుపై నిర్ణయాన్ని ఎన్నికల కమిషన్ అంగీకరించలేదు.
టెట్ ఫీజుల విషయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి టెట్‌కు ప్రభుత్వం భారీగా ఫీజులు పెంచింది. గతంలో పేపర్ 1 లేదా పేపర్ 2 ఏదైనా ఒకటి రాస్తే 200 రూపాయల ఫీజు ఉండగా, దాన్ని వెయ్యి రూపాయలకు పెంచింది. రెండూ పేపర్లు రాస్తే గతంలో 300 రూపాయలు ఉండగా, ఆ ఫీజును ఏకంగా 2వేల రూపాయలకు పెంచింది. పెంచిన ఫీజులపై అభ్యర్థులు, విద్యావేత్తలు అభ్యంతరం, ఆందోళన వ్యక్తం చేశారు.
దీంతో ఫీజులు తగ్గించేందుకు అనుమతివ్వాలని ఎన్నికల కమిషన్‌ను కోరగా, ఈసీ తిరస్కరించిందని ప్రభుత్వం వెల్లడించింది. అందుకే ప్రత్యామ్నాయ ఉపశమన నిర్ణయాలను ప్రకటించింది. ఈసారి టెట్‌లో అర్హత సాధించలేక పోయిన అభ్యర్థులు తదుపరి టెట్‌ను ఉచితంగా రాయవచ్చునని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అర్హత సాధించిన అభ్యర్థులు ఒకసారి డీఎస్సీ ఉచితంగా రాయవచ్చని సీఎం స్పష్టం చేశారు.
TG Teacher Eligibility Test Results 2024 :ఇక ఇవాళ విడుదల చేసిన టెట్ ఫలితాల్లో కొత్తగా ఉత్తీర్ణులైన వారికి డీఎస్సీ రాసే అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే డీఎస్సీ దరఖాస్తు గడువును ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించింది. డీఎస్సీకి ఇప్పటివరకు దాదాపు 2.35 లక్షల మంది అర్జీ చేసుకున్నారు. ఈ పరీక్షలు జులై 17 నుంచి 31 వరకు జరగనున్నాయి.
ప్రభుత్వ టీచర్ల పదోన్నతికి టెట్ తప్పనిసరి - టెన్షన్‌లో సీనియర్లు