Meet and Greet Program in Singapore : తెలంగాణ కల్చరల్ సొసైటీ(సింగపూర్) ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం సింగపూర్‌లోని వన్ వరల్డ్ ఇంటర్నేషనల్(GIIS) స్కూల్ ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి విచ్చేశారు. ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాస రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ రోహిణ్ కుమార్ రెడ్డి, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జయవీర్ కుందూరు, తెలంగాణ కల్చరల్ సొసైటీ(సింగపూర్) వ్యవస్థాపక అధ్యక్షులు బండ మాధవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డిని సింగపూర్ తెలుగు ప్రజల సమక్షంలో ఆహ్వానించారు. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారుల నృత్య ప్రదర్శనతో, స్వాగత గీతంతో ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో పలు రంగాలలో చేస్తున్న అభివృద్ధిని, తెలంగాణ ఔన్నత్వాన్ని భావితరాలకు అందించే ప్రణాళికను, ప్రపంచ దేశాలు రాష్ట్రం వైపు తలెత్తి చూసే సమయం ఆసన్నమైందని తెలిపారు. దానికి విదేశాలలో నివసిస్తున్న తెలంగాణ, తెలుగు ప్రజల సహాయ సహకారాలు ఉండాలని చెప్పారు. ఆ తర్వాత ఐటీ మంత్రి శ్రీధర్ బాబు డిజిటల్ రంగంలో చేస్తున్న అభివృద్ధిని వివరించారు.
సీఎం రేవంత్‌కు ఘనంగా సత్కారం :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ఇతర సభ్యులు అతిథిలు అందరినీ తెలంగాణ కల్చరల్ సొసైటీ(సింగపూర్) కమిటీ, సాంస్కృతిక కళాసారధి అధ్యక్షుడు కవుటూరు రత్నకుమార్, జీఐఐఎస్ ఛైర్మన్ అతుల్ తెముర్ణికల్ ఘనంగా సత్కరించారు.