CM Jagan on TTD EO Deputation Extension: టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై సీఎం జగన్ ప్రేమ మరోసారి బయటపడింది. ఐడీఈఎస్ (Indian Defense Estates Service) నుంచి వచ్చిన ధర్మారెడ్డికి కేంద్రం ఇప్పటికే పొడిగించిన రెండేళ్ల డిప్యుటేషన్ గడువూ ఈ ఏడాది మే 14తో ముగుస్తోంది. ఈ సంవత్సరం జూన్ 30కి ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. లెక్క ప్రకారం ఆయన మే 14వ తేదీన కేంద్ర సర్వీసులకు తిరిగి వెళ్లాలి. కానీ, ఆత్మబంధువులాంటి ధర్మారెడ్డిని జగన్ అంత తేలిగ్గా వదులుకోవడానికి సిద్ధంగా లేరు. జూన్ 30వ తేదీన ఆయన పదవీ విరమణ చేసేంత వరకు డిప్యుటేషన్‌ను పొడిగించాలంటూ దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఈ నెల 12న సీఎం జగన్ లేఖ రాశారు.
ఇవేం సాకులు అస్సలు: ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి నాలుగురోజుల ముందు జగన్ ఈ లేఖ రాయడం విశేషం. ధర్మారెడ్డిని జూన్ నెలాఖరు వరకు టీటీడీ ఈవోగా కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని లేఖలో సీఎం చెప్పిన కారణాలు చూస్తే బడి ఎగ్గొట్టేందుకు ఏ ఆరో తరగతి పిల్లవాడో హెడ్మాస్టర్కు రాసిన లేఖలో చెప్పే సాకులు గుర్తొస్తాయి.
జగన్‌కు ధర్మారెడ్డి నమ్మినబంటని, దిల్లీ స్థాయిలో తనకున్న పరిచయాలతో కావలసిన పనులు చేసిపెడతారని, కేంద్ర ఎన్నికల సంఘం వంటి సంస్థల్లోనూ పలుకుబడి ఉపయోగిస్తారని, ‘అతి సున్నితమైన’ వ్యవహారాలనూ సీఎం కోసం సునాయాసంగా చక్కబెడతారని పేరుంది. టీటీడీ చరిత్రలో అనేక దశాబ్దాల తర్వాత నాన్ ఐఏఎస్ అధికారిని ఈవోగా నియమించడమే కాకుండా, ఎంతకాలం వీలైతే అంతకాలం ఆయన్ను ఆ పోస్టులో కొనసాగించేలా చూసేందుకు సీఎం ప్రయత్నించడం విశేషం.
అధికార పార్టీకి అనుకూలంగా టీటీడీ నిర్ణయాలు- రెండు నెలల్లో మూడుసార్లు సమావేశాలు
ధర్మారెడ్డి ఉండకపోతే కష్టమట:వేసవి రద్దీ, ఇతర సమయాల్లో ఈవో ధర్మారెడ్డి సమర్థంగా వ్యవహరిస్తున్నారని, ఆయన ఇంటర్ కేడర్ డిప్యుటేషన్‌ను ప్రధాని పెద్ద మనసుతో రెండేళ్లు పొడిగించారని అన్నారు. ఆ గడువు మే 14తో ముగుస్తోందని, మే, జూన్ నెలల్లో తిరుమలలో రద్దీ దృష్ట్యా ఈవో వంటి కీలకమైన పోస్టుల్లో ఉన్నవారిని మార్చడం సరికాదని సీఎం పేర్కొన్నారు. అనుభవంలేనివారిని ఈ పోస్టులో ఉంచితే నిర్వహణపరమైన లోపాలు తలెత్తి సంక్షోభానికి దారితీస్తుందన్న సీఎం జగన్, శాంతిభద్రతల సమస్యగా మారుతుందని అని ఆ లేఖలో ఏకరవు పెట్టారు.
ఇదివరకెప్పుడూ వేసవి సెలవులే రానట్టూ, అప్పుడు రద్దీ లేనట్టూ, గతంలో ఉన్న అధికారులు ఎవరూ అటువంటి పరిస్థితుల్ని చూడనట్టూ సీఎం జగన్ పేర్కొనడం విడ్డూరం. కీలకమైన ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను, డీజీపీలనే ఉన్నపళంగా మార్చేస్తోంది. టీటీడీ ఈవోను మారిస్తే వ్యవస్థే స్తంభించిపోతుందన్నట్టు సీఎం లేఖ రాయడం వెనుక వేరే ప్రయోజనం కాక మరేముంటుంది?