Contract Employees Regularization: మాటలతో మాయ చేయడంలో జగన్‌ను మించిన ఘనులే లేరు. ఎన్నికల ముందు హామీలతో నమ్మించి అధికారంలోకి వచ్చాక వంచించడంలోనూ ఆయనకు ఆయనే సాటి. 2019 ఎన్నికల ముందు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామన్న హామీతో వారిలో ఆశలు కల్పించారు. తీరా అధికారంలోకి వచ్చాక నిబంధనల సాకుతో సాగదీసి, కొంతమందికి మాత్రమే చేసి చేతులెత్తేశారు. ఐదేళ్ల క్రితం ఇచ్చిన హామీ మళ్లీ ఎన్నికలు దగ్గరకు వచ్చే వరకు ఆయనకు గుర్తుకురాలేదు.
కోడ్ వస్తుందని తెలిసి కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంటూ హడావిడి చేశారు. అలాగైనా మాట నిలబెట్టుకున్నారా అంటే అదీ లేదు. అన్ని శాఖల్లో కలిసి 50వేలకుపైగా ఒప్పంద ఉద్యోగులు ఉంటే వారిలో కేవలం 10వేల 117 మంది మాత్రమే క్రమబద్ధీకరణకు అర్హులని వైసీపీ సర్కారు ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చేనాటికి కేవలం 3వేల 350మందిని మాత్రమే రెగ్యులరైజ్ చేసింది.
అన్ని ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగులసర్వీసు, విద్యార్హతలను పరిగణనలోకి తీసుకుని, వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేస్తానని ప్రతిపక్షనేతగా ప్రతి సభలోనూ జగన్ ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక నాలుగేళ్లు దీని గురించే పట్టించుకోలేదు. గతేడాది తీరిగ్గా ఈ అంశంపై కసరత్తు చేపట్టిన ప్రభుత్వం అర్హుల సంఖ్యను భారీగా కుదించాలనే ఉద్దేశంతో 2014 జూన్ 2 నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకొని ఉండాలనే నిబంధనను తీసుకొచ్చింది. దీనిపై ఒప్పంద ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రావడంతో ఐదేళ్ల నిబంధనను తొలగించింది.
ఆ తర్వాత ఒప్పంద ఉద్యోగి పనిచేస్తున్న పోస్టు ప్రభుత్వం మంజూరు చేసిందై ఉండాలనీ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇప్పటికీ మంజూరు పోస్టులోనే పనిచేస్తూ ఉండాలనే నిబంధన విధించింది. ఉద్యోగ నియామకానికి ప్రకటన ఇచ్చి ఉండాలనీ, ఆ పోస్టుకు రిజర్వేషన్ రోస్టర్ అమలు చేసి ఉండాలని ఇంకో నియమం పెట్టింది. సబ్జెక్టు సైతం క్లియర్ వెకెన్సీ ఉండాలని, ఏపీపీఎస్సీ(APPSC)ద్వారా భర్తీకి నోటిఫై చేసిన పోస్టు కాకుండా ఉండాలని స్పష్టం చేసింది. ఇలా అనేక వడపోతలతో ఒప్పంద ఉద్యోగుల సంఖ్యను బాగా తగ్గించేసింది.