CM Jagan in Bheemili Meeting: రాష్ట్రంలో రానున్న ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వర్ణించారు. ఈ ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని జగన్ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఎత్తులు, జిత్తులు పద్మవ్యూహాలు రచిస్తున్నాయని, వాటికి బలైపోవాడనికి తాను అభిమన్యుడ్ని కాదని అర్జునుడని అన్నారు.
విశాఖ జిల్లా భీమిలి పరిధిలోని సంగివలసలో 'సిద్ధం' పేరుతో వైఎస్సార్సీపీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. రాష్ట్రంలో ఐదు సంవత్సారాలుగా అమలు చేస్తున్న పథకాలే వైఎస్సార్సీపీకి గెలుపు అస్త్రాలని చెప్పారు. ఎన్నికల్లో విజయం సాధించడానికి మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నారని జగన్ వివరించారు.
జగన్‌కు కమిషన్లు ఇవ్వలేక పరిశ్రమలు తరలిపోతున్నాయి- వైసీపీ ఓటమి ఖాయమైంది: చంద్రబాబు
రానున్న ఎన్నికల యుద్ధంలో 175 సీట్లలోనూ వైఎస్సార్సీపీ గెలుపే లక్ష్యమని సీఎం ప్రకటించారు. ప్రతిపక్షాలను కౌవర సైన్యంతో పోల్చిన జగన్, పాండవుల సైన్యంగా తమను అభివర్ణించుకున్నారు. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చామన్నారు. వచ్చే ఎన్నికలు పేదలు, పెత్తందార్ల మధ్య జరుగుతున్నయుద్ధమన్నారు.
కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కనిపిస్తోందన్నారు. గ్రామాల్లోనే బ్రాడ్‌బ్యాండ్ సేవలు, డిజిటల్ లైబ్రరీలు అందుబాటులోకి వచ్చినట్లు వివరించారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసిందన్న విషయాన్ని ఇంటింటికి వెళ్లి చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వాలంటీర్లు అందరూ వైఎస్సార్సీపీకి చెందిన వాళ్లేనని భీమిలి సభ వేదికగా సీఎం స్పష్టం చేశారు.