'నా విశాఖ' అంటూనే అయిదేళ్లుగా కల్లబొల్లిమాటలు - మరోసారి వంచించేందుకే బస్సుయాత్ర! CM Jagan Fake Promises to Visakhapatnam: విశాఖను జగన్ ఒక బంగారు బాతులానే చూశారు. అధికారంలోకి వచ్చీరాగానే విశాఖలో విలువైన ఆస్తులను బ్యాంకుల్లో తాకట్టు పెట్టారు. గోపాలపట్నం రైతు బజారు, కప్పడారడలోని ఐఐటీ, పాలిటెక్నిక్, రేసవువానిపాలెంలోని రెవెన్యూ క్వార్టర్స్, చినగదిలిలో డెయిరీఫాం, సీతమ్మధార తహసీల్దార్ కార్యాలయం, బక్కన్నపాలెం సెరీకల్చర్, స్త్రీ శిశు సంక్షేమ భవన్, కిర్లంపూడి లేఅవుట్లోని పోలీస్ క్వార్టర్స్, ఇరిగేషన్ ఈఈ బంగ్లా, కార్యాలయం, సీఈ బంగ్లా, సర్క్యూట్స్ ఇలా ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి 28 వేల 200 కోట్లు రుణాలు పొందారు.
ఈ రుణంలో ఒక్క రూపాయి విశాఖ అభివృద్ధికి ప్రత్యేకంగా ఖర్చు చేశారా? అంటే సమాధానం లేదు. ఆంధ్రుల హక్కుగా భావించే విశాఖ ఉక్కును ఆర్థికంగా ఆదుకోవడానికి చిన్నపాటి ప్రయత్నమూ జగన్ చేయలేదు. పైపెచ్చు 450 కోట్లు కుమ్మరించి బాగున్న పర్యాటకశాఖ భవనాలు కూల్చి, రుషికొండపై విలాసవంతమైన రాజ భవనాలు నిర్మించుకున్నారు.
ఐదేళ్లు మోసం చేశారు - ఇప్పుడెలా వస్తున్నారు ? - సీఎం జగన్‌ను ప్రశ్నిస్తున్న కాకినాడ ప్రజలు - Jagan Not Fulfil Promises to people
యథేచ్ఛగా సీఆర్‌జెడ్ నిబంధనలు ఉల్లంఘన: ఎన్టీపీసీని ఆనుకుని ఉన్న స్వయంభువరం గ్రామ ప్రజలు దుమ్ముధూళితో తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లిందని, సమస్య పరిష్కరించాలని కోరినా ఫలితం లేకపోవడంతో ఎన్నికలు బహిష్కరించారు. ఆ సమయంలో పాండురంగాపురంలో రజకులకు ఇళ్లు నిర్మిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చి ఆ ఊసే మరిచారు. జోడుగుళ్లపాలెం జంక్షన్ వద్ద మత్స్యకారులకు వలలు అల్లుకునేందుకు షెడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన జగన్ సీఆర్‌జెడ్ నిబంధనల పేరుతో దానిని పక్కన పెట్టేశారు. విజయసాయిరెడ్డి మాత్రం బీచ్ కారిడార్లో యథేచ్ఛగా సీఆర్‌జెడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారు.
సామాజిక మాధ్యమాల్లో విమర్శల వెల్లువ: మరోవైపు నగరాభివృద్ధి పేరుతో విశాఖలో ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలు ఒక్కొక్కటి కూలిపోతున్నాయి. ఒక్కో 'బస్ బే' కు 30నుంచి 50 లక్షలు ఖర్చు చేసినప్పటికీ అవి నాసిరకంగా మారాయి. గంటల వ్యవధిలోనే జీవీఎంసీ ముందున్న 'బస్ బే' ఒక్కసారిగా కుప్పకూలడమే ఇందుకు నిదర్శనం. ఆ తర్వాత కోటి 60 లక్షలతో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేతుల మీదుగా ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జి రోజు గడవక ముందే కొట్టుకుపోయింది. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు రావడంతో దాన్ని పునఃనిర్మించాలని యత్నించి చివరకు పక్కన పెట్టేశారు. వీటన్నిటిని గమనిస్తే జగన్ ప్రభుత్వానికి కూల్చడమే తప్ప కట్టడం చేతకాదంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చప్పట్లు కొట్టించుకోవడానికి హమీలు - పక్కకెళ్లగానే గాలికొదిలేసిన జగన్ - CM jagan break to The Promises
నీతి వాఖ్యాలు ఏం అయ్యాయి: ఎన్నికలకు 6 నెలల ముందు శంకుస్థాపనలు చేస్తే అది మోసమని, అధికారంలోకి రాగానే శంకుస్థాపనలు చేస్తే అది చిత్తశుద్ధి అంటూ జగన్ పలుమార్లు నీతి వాఖ్యాలు పలికారు. ముఖ్యమంత్రి హోదాలో విశాఖకు వచ్చిన జగన్ 2019లో ఒకేసారి జీవీఎంసీ, వీఎంఆర్డీఏకి సంబంధించి 905 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. వాటిలో కేవలం 130 కోట్లు మాత్రమే ఈ ఐదేళ్లలో ఖర్చు చేశారు. దీంతో ఎక్కడి పనులు అక్కడ అసంపూర్తిగా నిలిచిపోయాయి. మరికొన్ని ప్రాజెక్టులను అసలు ప్రారంభించనేలేదు. తాజాగా ఎన్నికల కోడ్ ముందు జీవీఎంసీ పరిధిలో 15 వందల కోట్ల పనులకు జగన్ శంకుస్థాపనలు చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత చేసిన శంకుస్థాపనలకే నేటికి అతిగతి లేదని, అలాంటిది ఎన్నికల వేళ మరోమారు శంకుస్థాపనల పేరుతో జగన్ మోసం చేస్తున్నారని నగరవాసులు పెదవి విరుస్తున్నారు.
టీడీపీ హయాంలో విశాఖ మెట్రోకు సంబంధించిన ప్రణాళికలు చివరి దశ వరకు వచ్చాయి. ప్రభుత్వం మారడంతో అవన్నీ తలకిందులయ్యాయి. ఈ ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వ మెట్రో ప్రణాళికను డీపీఆర్ ఆమోదం దశలోనే ఉంచింది. అప్పట్లో 42.5 కిలోమీటర్ల మేర నిర్మించాలనుకుంటే, వైసీపీ ప్రభుత్వం దానిని 140.13 కిలోమీటర్లకు పెంచి హడావుడి చేసింది. మొదటి కారిడార్ నిర్మాణ పనులను 2024కు పూర్తిచేస్తామని జగన్ హామీ ఇచ్చినప్పటికీ ఎన్ఏడీ పైవంతెనకు అనుసంధానంగా నిర్మించాల్సిన ఆర్ఓబీ ఇంకా పూర్తవ్వలేదు. ఈ ప్రాజెక్టును గత టీడీపీ హయాంలో ప్రారంభించారు.
మాట ఇవ్వటం మడమ తిప్పటం జగనన్నకు అలవాటే! - Jagan False Promises
పనులు చేయలేక చేతులెత్తేసిన వైనం: కైలాసగిరిని ప్రపంచ బ్యాంకు నిధులతో అభివృద్ధి చేయాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం నిధులు తెచ్చింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ నిధులు మురిగిపోవడంతో పనులు చేయలేక చేతులెత్తేసింది. కైలాసగిరిపై అత్యాధునికంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో ప్లానెటోరియం నిర్మించాలనుకున్నారు. కన్సల్టెంట్లను పిలిపించి ఆకృతులు సిద్ధం చేయించారు. స్థల పరిశీలన జరిపి ప్రభుత్వ అనుమతికి పంపించి వదిలేశారు. నాలుగున్నర ఏళ్ల కిందట సీఎం శంకుస్థాపన చేసినా దానిని పక్కన పెట్టిసి 'సైన్స్ సిటీ' పేరుతో మరో ప్రాజెక్టును తెరమీదికి తెచ్చారు. కాపులుప్పాడలో చారిత్రక సందర్శనాలయం, పరిశోధన సంస్థకు వీఎంఆర్డీఏ స్థలాన్ని ఎంపిక చేసింది. ఆకృతులు సైతం సిద్ధం చేసి డీపీఆర్‌ని ఇటీవల ప్రభుత్వానికి పంపి మమ అనిపించింది.
బహుళ అంతస్థుల కార్ల పార్కింగ్ ఏం అయింది: విశాఖలో 400 కార్లు, 600 ద్విచక్ర వాహనాలు నిలిపేందుకు వీలుగా బహుళ అంతస్థుల కార్ల పార్కింగ్ నిర్మాణానికి అప్పట్లో సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. వాస్తవానికి ఇది రెండేళ్ల కిందటే పూర్తి చేయాల్సి ఉంది. అయితే సాంకేతిక అంశాలను సాకుగా చూపడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి.
గత ఎన్నికల్లో ప్రైవేట్ టీచర్లపై ఎక్కడ లేని ప్రేమ - పదవీకాలం ముగుస్తున్నా పట్టించుకోని జగన్ - Jagan Govt Cheated Private Teachers