CM Jagan Cheating Youth in AP :విద్యార్థులు చిన్నప్పటి నుంచీ పుస్తకాలతో కుస్తీపట్టి ఎన్నో పరీక్షలు రాసుంటారు. ఒక్కో పరీక్ష పాసవుతూ చదువులు పూర్తి చేసుకుని ఉంటారు. అలాంటి లక్షల మంది యువతీయువకుల భవిష్యత్‌కు ఇప్పుడు అసలు సిసలు పరీక్ష ఎదురవుతోంది. 2024 ఎన్నికల పరీక్షకు తెలుగుదేశం, వైఎస్సార్సీపీ మేనిఫెస్టోల్లోని హామీలే సిలబస్! నవ్యాంధ్రకు రాజధాని కావాలా? వద్దా? రాష్ట్రానికి కంపెనీలు తెచ్చేవారు కావాలా? తరిమేసేవారు కావాలా? నైపుణ్య శిక్షణతో ఏపీని ముందుకు తీసుకెళ్లే నాయకుడు కావాలా? నైపుణ్యాభివృద్ధిని నాశనం చేసి ఆంధ్రను బిహార్ కన్నా దారణంగా దిగజార్చిన పాలకుడు కావాలా? తేల్చుకోవాల్సింది యువతే! భవిష్యత్‌ను నిర్ణయించుకోవాల్సింది యువతే.
కొలువుల కల్పన VS జాబ్ క్యాలెండర్ జాబ్‌లెస్ క్యాలెండర్ : ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ అంటూ 2019లో మోసగించిన జగన్ 2024 ఎన్నికల మేనిఫెస్టోలో కొత్త వల పన్నారు. క్రమం తప్పకుండా గ్రూప్స్ నోటిఫికేషన్ ఇచ్చి, UPSC తరహాలో నిర్దిష్ట సమయంలో పరీక్షలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఐతే జగన్‌ను నమ్మేదెలా? 2019 ఎన్నికల ముందు మెగా డీఎస్సీ అంటూ మోసం చేసిన జగన్ ఎన్నికలకు నెల ముందు కేవలం 6,100 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు! ఎన్నికల కోడ్‌తో అదీ వాయిదా పడింది. ఆశావహులు తీవ్ర నిరాశనిస్పృహల్లో మునిగిన వేళ మెగా డీఎస్సీ పైనే మొదటి సంతకమని తెలుగుదేశం ప్రకటించింది! తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి, ఉద్యోగ కల్పనకు ప్రత్యేక ఎంప్లాయిమెంట్ జోన్ క్రియేట్ చేస్తామని భరోసాఇచ్చింది. వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో ఆ ఊసే లేదు.
పీజీ పిల్లలకూ ఫీజు రీఎంబర్స్‌మెంట్VSపీజీ పిల్లలకు ఫీజు రీఎంబర్స్‌మెంట్ లేదు : జగన్ ఐదేళ్లలో ప్రైవేటు కళాశాలల్లో పీజీ కోర్సులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నిలిపివేశారు. పీజీలోపు విద్యార్థులకూ ఫీజు రీఎంబర్స్‌మెంట్‌లో గందరగోళం సృష్టించారు. ఓట్ల కోసం తల్లుల ఖాతాల్లో వేస్తామని చెప్పి, డబ్బులు ఇవ్వకుండా పేదలపై రూ. 3,174 కోట్లు బకాయిపెట్టారు. 2023-24 సంవత్సరానికి ఒక్క రూపాయి కూడా జగన్ ఇవ్వలేదు! విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి, ఫీజులు కట్టారు. ఆ కష్టాలన్నీ లేకుండా కళాశాలలకే ఫీజు రీఎంబర్స్‌మెంట్ చెల్లించి, సర్టిఫికెట్ల మంజూరు విషయంలో విద్యార్థులకు చిక్కుల్లేకుండా చేస్తామని తెలుగుదేశం మేనిఫెస్టోలో తెలిపింది. ఎయిడెడ్, ప్రైవేటు కళాశాలల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని పునరుద్దరిస్తామనీ హామీ ఇచ్చింది.
చితికిన కౌలు రైతు బతుకు - గడిచిన ఐదేళ్లుగా ధీమా లేదు, బీమా రాదు! - Jagan Neglect Tenant Farmers
కంపెనీలకు ఆహ్వానంVSకంపెనీలకు పొగ :ఇక అత్యధిక ఉద్యోగ కల్పన చేసే సూక్ష్మ, స్థూల, మధ్యతరహా కంపెనీలు, సంస్థలకు ప్రోత్సహకాలిస్తామని తెలుగుదేశం మేనిఫెస్టోలో ప్రకటించగా వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో ఆ ప్రస్తావనేలేదు. అంటే ఉపాధి కోసం యువత పక్క రాష్ట్రాలకు వలసపోవాల్సిందేనేమో! వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూసేసిన నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్ని తిరిగి తెరిపించి మరింత విస్తరిస్తామని తెలుగుదేశం యువతకు భరోసా ఇచ్చింది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగ కల్పనకు తోడ్పాటు అందిస్తామని మేనిఫెస్టోలో పెట్టింది. వైఎస్సార్సీపీ సర్కార్‌కు అవేమీ పట్టలేదు. రాష్ట్రంలో ప్రపంచ స్థాయి సదుపాయాలతో క్రీడల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం హామీ ఇవ్వగా వైఎస్సార్సీపీ మాత్రం ఎన్నికల ముందు ప్రచారం కోసం వాడుకున్న 'ఆడుదాం ఆంధ్రా'’ కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపింది! ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు చేయకుండా ప్రతి జిల్లాలోనూ క్రీడా మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ పెడతామని వైఎస్సార్సీపీ 2024 మేనిఫెస్టోలో చెప్పుకొచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన 10 శాతం ఈడబ్యూఎస్ రిజర్వేషన్లను ప్రతీ ఐదేళ్లకు ఒకసారి ఆర్థిక సర్వే చేసి అమలు చేస్తామని తెలుగుదేశం మేనిఫెస్టోలో చేర్చగా వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో ప్రయత్నమే కనిపించలేదు.
రాజధానుల పేరిట జగన్ మూడు ముక్కలాట - బలైన భవన నిర్మాణ కార్మికులు - CM Jagan Neglect Labours
నైపుణ్యశిక్షణVSశిక్షణ భక్షణ:తెలుగుదేశం హయాంలో యువత, విద్యార్థులకు నైపుణ్యం అందించేందుకు కొత్తగా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేశారు. శిక్షణల కోసం రూ.200 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. అత్యధిక ఉపాధి అవకాశాలున్న రాష్ట్రాల జాబితాలో ఏపీని మొదటి స్థానంలో నిలిపారు. సీమెన్స్ సంస్థ సహకారంతో శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆరు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లు, 34 సాంకేతిక నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు నెలకొల్పారు. పదోతరగతి, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వారికీ ప్రత్యేక శిక్షణలిచ్చారు. మూడేళ్లలో 2,72,198 మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వగా 64,444 మందికి ఉద్యోగాలు లభించాయి. అందులో కొందరు స్టార్టప్‌లు కూడా ఏర్పాటు చేశారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ కంపెనీలతో కలిసి జాబ్ మేళాలూ నిర్వహించారు. తద్వారా బీఎస్సీ చేసిన వారికీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు లభించాయి.
జగన్ వచ్చాక నైపుణ్య శిక్షణే లేకుండా చేశారు. చంద్రబాబుపై కక్షతో సీమెన్స్ కేంద్రాలను మూసేశారు. హెచ్‌సీఎల్‌తో కలిసి విశాఖలో నైపుణ్య విశ్వవిద్యాలయ ఏర్పాటుకు తెలుగుదేశం ప్రభుత్వం ఒప్పందం చేసుకుని భూములూ కేటాయించింది. జగన్ దాన్ని విశాఖలో కాదని తిరుపతి జిల్లా కోబాక సమీపంలో నైపుణ్య వర్సిటీ అంటూ నాలుగున్నరేళ్ల క్రితం 50 ఎకరాలు కేటాయించారు. దానిపేరు చెప్పుకుని తిరుపతి వైఎస్సార్సీపీ నేతలు స్థిరాస్తి వ్యాపారాలు చేసుకున్నారేగానీ ఇంతవరకూ వర్సిటీ పనులే చేపట్టలేదు. లోక్‌సభ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 25 నైపుణ్య కళాశాలలంటూ ఊదరగొట్టిన జగన్ కనీసం ఒక్కో భవన నిర్మాణానికి రూ.20 కోట్ల నిధులు కూడా ఇవ్వలేదు. నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ఒక్కో నైపుణ్య కళాశాల ఏర్పాటు చేస్తామన్న హామీకీ అతీగతీలేదు.