CM Jagan Bus Yatra Passengers Problems: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం సభల వల్ల ప్రయాణికులు నానా అగచాట్లు పడాల్సి వస్తోంది. గత కొన్ని రోజుల నుంచి ఆయన పలు ప్రాంతాలలో బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. మేమంతా సిద్ధం సభలకు ప్రజలను తరలించేందుకు ఆర్టీసీ బస్సులను ఉపయోగిస్తున్నారు. ఈ మేరకు ఇవాళ మదనపల్లిలో నిర్వహిస్తున్న సభకు వివిధ జిల్లాలో నుంచి పెద్ద ఎత్తున బస్సులు తరలించారు.
దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు గంటల తరబడి ఎదురుచూసి చేసేదేమీ లేక వెనుదిరిగారు. చిత్తూరు జిల్లా పలమనేరు ఆర్టీసీ డిపోలో మెుత్తం 56 బస్సులు ఉండగా అందులో 40 బస్సులను మదనపల్లె సభకు తరలించారు. ముందస్తు సమాచరం లేకుండా బస్సులను తరలించడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉన్నది ప్రజల కోసమా, రాజకీయ నాయకుల కోసమా అంటూ అధికారులను నిలదీశారు.
కడప డిపో నుంచి సూమారు 187 బస్సులు: మరోవైపు కడప జిల్లా నుంచి 187 బస్సులను ఏర్పాటు చేశారు. ఒక్క కడప డిపో నుంచే 35 బస్సులను సిద్ధం సభకు పంపించడంతో ప్రయాణికులు తీవ్ర అగచాట్లు పడ్డారు. బస్సులు లేక ప్లాట్ ఫామ్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. ఎప్పుడో గంట తర్వాత వస్తున్న ఒక్కో బస్సు వస్తుండటంతో రద్దీ ఎక్కువగా ఉండటం వలన సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కర్నూలు అనంతపురం, చిత్తూరు తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులు సక్రమంగా రావడం లేదు. 'మేమంతా సిద్ధం' సభలు ముగిసేంతవరకు ప్రయాణికులకు ఈ తిప్పలు తప్పవని తెలుస్తోంది. చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు పడరాని పాట్లు పడుతున్నారు.