ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సహజవనరులు కొల్లగొట్టిన వైఎస్సార్సీపీ నేతలు- ఐదేళ్ల అక్రమాలపై శ్వేతపత్రం సిద్ధం - White paper on resources - WHITE PAPER ON RESOURCES

White Paper on YSRCP Irregularities : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూకబ్జాలు, ఇసుక, ఎర్రచందనం దోపిడీపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఈ నెల 15న వీటికి సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారు.

WHITE PAPER ON RESOURCES
WHITE PAPER ON RESOURCES (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 14, 2024, 8:57 AM IST

White Paper on YSRCP Irregularities :రాష్ట్రంలో భూములు, ఇసుక, సహజ వనరులను గత ప్రభుత్వ హయాంలో దోచుకున్న వ్యవహారంపై కూటమి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఈ నెల 15న సీఎం చంద్రబాబు వివరాలు వెల్లడించనున్నారు. ముఖ్యంగా ల్యాండ్‌ టైటిలింగ్ చట్టం ద్వారా ఎలాంటి విధ్వంసానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెరతీసిందన్న అంశాన్ని ప్రజలకు తెలియచెప్పాలని నిర్ణయించారు. 300 కోట్ల రూపాయల విలువైన భూముల్ని వైసీపీ కార్యాలయాలకు కేటాయించుకున్న పరిస్థితులనూ ప్రజలకు వివరించనున్నారు.

గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఇష్టానుసారంగా ఇసుక, ఇతర ఖనిజ వనరుల్ని దోపిడీ చేశారని, భూములు కబ్జా చేశారని అలాగే ఎర్రచందనం వంటి అరుదైన వనరులనూ దోచుకున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశాలపై పూర్తి వివరాలు ప్రజలకు తెలిసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ నెల 15వ తేదీన ఈ మూడు అంశాలకు చెందిన వివరాలను సీఎం విడుదల చేయనున్నారు.

భూములు, ఇసుక, ఖనిజ, సహజ వనరుల విషయంలో ఏ మేరకు విధ్వంసం జరిగింది?, రాష్ట్ర ప్రయోజనాలు ఎలా దెబ్బతిన్నాయి?, ప్రజలకు ఏ మేర నష్టం వాటిల్లిందన్న విషయాలను వెల్లడించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో తెచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్ చట్టం ఎలా హాని కలిగించేదన్న అంశాన్ని ప్రజలకు వివరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రధానమైన ప్రాంతాల్లో 300 కోట్ల రూపాయల విలువైన భూముల్ని కబ్జా చేసి వైఎస్సార్సీపీ కార్యాలయాలు నిర్మించుకోవడం వంటి అంశాలను ప్రజల దృష్టికి తేనున్నారు. రీసర్వే అంశంలో గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న తప్పులను ప్రజలకు తెలియ చెప్పనున్నారు.

'విద్యుత్​ రంగంపై 1,29,503 కోట్ల నష్టం'- రూ.500, 200 నోట్లను కూడా రద్దు చేయాలి : చంద్రబాబు - white paper on power sector

సెంటు భూమి పేరిట పేదలకు గత ప్రభుత్వం చేసిన అన్యాయంపైనా వివరాలు చెప్పాలని ప్రభుత్వం భావిస్తోంది. అసైన్డ్​ భూముల వ్యవహారంలో రాష్ట్రవ్యాప్తంగా 39 వేల ఎకరాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం విక్రయించేసిన అంశాన్ని ప్రధానంగా ప్రజల దృష్టికి తేవాలన్న యోచనలో ఉంది. కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో అనర్హులకు 13 వేల ఎకరాల పైచిలుకు అసైన్డు భూముల్ని కట్టబెట్టిన వ్యవహారాన్ని కూడా వెలుగులోకి తేవాలని నిర్ణయించారు. 22(A‍) నిషిద్ధ జాబితా నుంచి లక్షలాది ఎకరాలను తొలగించిన అంశాన్ని, దీని ద్వారా ప్రజలు ఎన్ని వేల కోట్ల రూపాయల మేర నష్టపోయారన్న విషయాన్నీ శ్వేతపత్రం ద్వారా వివరించే అవకాశముంది.

లండన్‌ మ్యూజియంలో అమరావతి గ్యాలరీ - ఆయన సూచనకు సంపూర్ణ ఆమోదం - White Paper on Amaravati

2019-24 మధ్య అమలైన ఇసుక విధానం, దాని పర్యవసానాలను శ్వేతపత్రం ద్వారా వెల్లడించనున్నారు. జేపీ వెంచర్స్‌, ప్రతిమ, జేసీ కేసీ సంస్థలకు ఇసుక తవ్వకాలను అప్పగించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా దోపిడీ జరుగుతున్నా ప్రజలపై భారం మోపుతున్నా పట్టించుకోని వైనాన్ని ప్రజలకు వివరించనున్నారు. ఇసుక ధరలు ఇష్టమొచ్చినట్లు పెంచేయడం వల్ల ప్రజలపై సుమారు 5 వేల కోట్ల రూపాయల భారం పడిందని అంచనా. ఉచిత ఇసుక విధానం రద్దు వల్ల లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతిందన్న అంశాన్నీ ప్రస్తావించనున్నారు. ఇతర తవ్వకాల విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయల రెవెన్యూ నిలిచిపోయిన పరిస్థితినీ వివరించనున్నారు.

వైఎస్సార్సీపీ హయాంలో ఎర్ర చందనం స్మగ్లింగ్‌, అటవీ ప్రాంతంలో అక్రమ తవ్వకాలు, అత్యంత సున్నితమైన అటవీ భూముల్లో ఇళ్ల పట్టాల పంపిణీ లాంటి అంశాలనూ శ్వేతపత్రంలో ప్రస్థావించనున్నారు. 2019-24 మధ్య కేవలం 836 మెట్రిక్‌ టన్నులు మాత్రమే ప్రభుత్వం అధికారికంగా వేలం వేయగలిగింది. ఆ సమయంలో వేల కోట్ల రూపాయల విలువైన ఎర్ర చందనాన్ని స్మగ్లర్లు తరలించుకుపోయాలని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ అంశాలను ప్రభుత్వం శ్వేతపత్రం ద్వారా వెల్లడించనుంది.

పోలవరం ప్రాజెక్టుకు శాపంలా జగన్‌ - నిపుణుల కమిటీ నివేదికే కీలకం: చంద్రబాబు - white paper on the Polavaram

ABOUT THE AUTHOR

...view details