CM Chandrababu Visited Real Time Governance Center in Secretariat :2024 ఎన్నికల్లో విజయం తరువాత సచివాలయంలోని ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ) కేంద్రాన్ని సీఎం చంద్రబాబు తొలిసారి సందర్శించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ను ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. అయితే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ వ్యవస్థను పూర్తిగా పక్కన పెట్టింది. ప్రస్తుతం ఈ కేంద్రం పనితీరును సీఎం సమీక్షించారు. అనంతరం సీఎస్, డీజీపీ సహా ఉన్నతాధికారులతో ఆర్టీజీ కేంద్ర కమాండ్ కంట్రోల్లో సమావేశం అయ్యారు. ఆర్టీజీ ద్వారా పౌరసేవలను సులభతరం చేయడం పాలనలో వేగం పెంచడంపై అధికారులతో చర్చించారు.
రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు, ప్రభుత్వ కార్యక్రమాలపై 100 రోజుల్లో ప్రత్యేక ప్రాజెక్ట్ సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సీఎస్, డీజీపీ సహా ఇతర ఉన్నతాధికారులతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. పౌరసేవల సులభతరం, పాలనలో వేగం పెంచడంపై చర్చించారు. ప్రజలకు సంబంధించిన మాస్టర్ డేటాను అన్ని శాఖలు యాక్సిస్ చేసుకుని సత్వర సేవలు అందించేలా ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు.
RTGS :ఆధార్, వాక్సినేషన్ డేటా, స్కూల్ అడ్మిషన్, రేషన్ కార్డుల్లో పేర్ల నమోదు, మ్యారేజ్ సర్టిఫికెట్, ఇతర సర్టిఫికెట్ల వంటి కార్యక్రమాలు ప్రజలకు ఆటోమేటిక్‌గా అందించే అంశంపై చర్చించారు. పారిశుద్ధ్యం, ట్రాఫిక్, ప్రమాదాలు, నేరాలు, రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, పంట కాలువల నిర్వహణ, అగ్రికల్చర్, వరదలు, భారీ వర్షాలు, విపత్తులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ వంటి అంశాల్లో ఆర్టీజీఎస్ (RTGS) ద్వారా తీసుకోదగిన చర్యలపై చర్చించారు. సమస్యలపై రియిల్ టైంలో ప్రభుత్వం స్పందించే విధానం అందుబాటులోకి వస్తే ప్రజలకు సత్వర సాయం అందుతుందని అన్నారు.