CM CHANDRABABU MEETING WITH SECRETARIES: ఈ నెల 11వ తేదీన సచివాలయంలో అన్ని శాఖల కార్యదర్శులు, మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న ఈ సమావేశంలో పాలనా అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రెండు సెషన్లుగా మంత్రులు, కార్యదర్శుల సమావేశం జరగనుందని తెలియడంపై ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై చర్చించనున్నారు.
మొదటి సెషన్లో ఫైళ్ల క్లియరెన్సు, వాట్సప్ గవర్నెన్స్, మిషన్ కర్మయోగి, జీఎస్డీపీలపై చర్చించనున్నారు. రెండో సెషన్లో కేంద్ర బడ్జెట్, త్వరలో ప్రవేశ పెట్టే ఏపీ బడ్జెట్, శాఖల వారీగా ప్రగతి మేనిఫెస్టో అమలు, స్వర్ణాంధ్ర 2047 పై చర్చ జరగనుంది. దీనిపై 10వ తేదీ మధ్యాహ్నం లోగా సెక్రటరీలు తమ డిపార్ట్మెంట్కు సంబంధించి రెండు ప్రెజెంటేషన్స్ పంపాలని సీఎంఓ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యాలు గుర్తించి అందుకనుగుణంగా కార్యదర్శులు తమ ప్రెజెంటేషన్ 15 నిమిషాలు ఉండేలా తయారు చేసుకోవాలని సీఎస్ ఆదేశాలిచ్చారు.