AP Cabinet Meeting Updates Today : ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశమైంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ర్యాటిఫికేషన్ సహా వాలంటీర్ల వ్యవస్థ, రాష్ట్రవ్యాప్తంగా భూ అక్రమాలపై వస్తున్న ఫిర్యాదులు చేపట్టాల్సిన చర్యలపైనా కేబినెట్లో చర్చించనున్నారు. అదేవిధంగా స్థానిక సంస్థలు, సహకార సంఘాల్లో నిబంధనలపై చర్చించే అవకాశం ఉంది. ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హత నిబంధనను తొలగించే అంశంపై చర్చలు జరపనున్నారు. ఎన్నికల హామీగా ఈ నిబంధనను తప్పిస్తామని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది.
AP Cabinet Meeting 2024 :అదేవిధంగామావోయిస్టులపై నిషేధం పొడిగిస్తూ మంత్రివర్గంలో తీర్మానం చేసే అవకాశం ఉంది.రామాయపట్నం పోర్టు అంశంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టులు, ఎయిర్ స్ట్రిప్‌ల నిర్మాణానికి సంబంధించిన అంశంపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వేర్వేరు ప్రభుత్వ రంగ సంస్థలు, శాఖల్లో జరిగిన అక్రమాలపై విచారణకు సంబంధించిన అంశంపై కూడా చర్చించేందుకు ఆస్కారం ఉంది. అన్న క్యాంటీన్లు సహా సంక్షేమ పథకాల అమలుకు కేబినెట్ ఆమోదాన్ని తెలపనుంది.
అదేవిధంగా మత్స్యకారుల జీవనోపాధికి గండి కొట్టేలా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 217 జీవో రద్దుపై మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గత ప్రభుత్వంలోని ఎక్సైజ్ అవతవకలపై, నూతన ఎక్సైజ్ విధానంపైనా చర్చిస్తారని సమాచారం. మరోవైపు వైఎస్సార్సీపీ ప్రభుత్వం భూముల రీసర్వే పేరుతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని సీఎం చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. వీటిపై కూడా కేబినెట్లో చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Chandrababu Visit Guntur and Bapatla Districts : కేబినెట్ భేటీ అనంతరం చంద్రబాబు గుంటూరు, బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన హెలికాప్టర్లో బాపట్ల జిల్లా వేటపాలెంకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చీరాల జంద్రాపేటలోని బీవీ అండ్ బీఎన్ హైస్కూల్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన జాతీయ చేనేత దినోత్సవంలో చంద్రబాబు పాల్గొంటారు.