ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

4 రోజుల పాటు భారీ వర్షాలు - అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

చెరువు, కాలువ కట్టల పరిరక్షణపై దృష్టి పెట్టాలన్న సీఎం - ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు ఉమ్మడి చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో వర్షాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

Updated : 3 hours ago

CM Chandrababu on Rains
CM Chandrababu on Rains (ETV Bharat)

CM Chandrababu Teleconference with Officials on Rains: భారీ వర్షాలపై జిల్లా కలెక్టర్లు, మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపిందని అన్నారు. చెరువులు, కాలువలు, నీటి వనరుల వద్ద అప్రమత్తంగా ఉండి, పర్యవేక్షణ ఉంచాలని సీఎం ఆదేశించారు. అతి భారీ వర్షాలు ఉండే ప్రాంతంలో ప్రజలకు ముందుగా సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయాలని సూచించారు.

ప్రజల మొబైల్ ఫోన్లకు భారీ వర్షాలపై మెసేజ్​లు పంపి అలెర్ట్ చేయాలని, చెరువు కట్టల, కాలువ కట్టల పరిరక్షణపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. వాగులు, కాలువల వద్ద అవసరమైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. రెయిన్ ఫాల్ వివరాలను కూడా రియల్ టైంలో అందుబాటులో ఉండాలని సూచించారు. అప్రమత్తతతో ప్రాణ, ఆస్థినష్టం లేకుండా చేయాలన్నారు. కంట్రోల్ రూంల ఏర్పాటుతో ప్రజల వినతులపై వేగంగా స్పందించాలన్నారు. సమర్థవంతమైన నీటి నిర్వహణ ద్వారా చెరువులు, రిజర్వాయర్లు నిండేలా ఇరిగేషన్ శాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు ఉమ్మడి చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం నెల్లూరులో 30 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యిందని అధికారులు సీఎంకు వివరించారు. మంగళవారం నుంచి వర్షాల ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. నెల్లూరు, తిరుపతి జిల్లాలో అవసరమైన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ సిద్దంగా పెట్టినట్లు అధికారులు తెలిపారు.

అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. భారీ వర్షాలు, ఆయా ప్రాంతాల్లో అధికారులు, ప్రభుత్వ విభాగాల సన్నద్దతపై సీఎం సమీక్షించారు. రాష్ట్రంలో ఈ సీజన్ లో 676 మిల్లీమీటర్ల సరాసరి వర్షపాతానికిగాను ఇప్పటి వరకు 734 ఎంఎం వర్షపాతం నమోదైందన్నారు. 18 జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం, 8 జిల్లాల్లో సాధారణం, అంతకంటే తక్కవ వర్షపాతం నమోదైందని అధికారులు సీఎంకు వివరించారు.

బంగాళాఖాతం ఉగ్రరూపం ! - పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రతలు - ఇక నెలంతా తుపాన్లే

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో, విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ నుంచి సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్, స్పెషల్ సీఎస్ సిసోదియా పర్యవేక్షిస్తున్నారు. భారీ వర్షాల నేపధ్యంలో జిల్లా కలెక్టర్లు, అధికారులకు తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. పోలీసు, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆర్&బీ అధికారులు అలెర్ట్​గా ఉండాలని ఆదేశించారు. ప్రభావిత జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులందరినీ వెంటనే వెనక్కి రప్పించాలని ఆదేశించారు.

ఈదురగాలుల తీవ్రతను బట్టి విద్యుత్ శాఖ తగిన చర్యలు వెంటనే తీసుకోవాలన్నారు. భారీ వర్షాలు ప్రభావంతో పొంగిపొర్లే రోడ్లు వెంటనే మూసేయాలని ఆదేశించారు. ప్రమాదకరమైన కల్వర్టుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న ఇంట్లో ఉండే వారిని సచివాలయ సిబ్బంది సురక్షిత భవనాలకు పంపాలని ఆదేశించారు. అర్బన్ ఫ్లడ్ వలన రోడ్ల మీద నీళ్లు నిలవకుండా ముందుగానే డ్రైనేజీ, నాళాలు శుభ్రం చేయాలని సూచించారు. కాలువలు, చెరువులు, వాగుల వద్ద పరిస్థితిని ఇరిగేషన్ వాళ్లు ఎప్పడికప్పుడు పర్యవేక్షించాలని స్పష్టంచేశారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం - 48 గంటల్లో మరింత బలపడే అవకాశం

Last Updated : 3 hours ago

ABOUT THE AUTHOR

...view details