CM CBN Sanctioned Funds for Free Cylinders Scheme:సూపర్ 6 హామీల్లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి రాష్ట్రం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి ఖర్చయ్యే నిధులను సీఎం చంద్రబాబు పెట్రోలియం సంస్థలకు అందజేశారు. అమరావతిలోని సచివాలయంలో హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థల ప్రతినిధులకు సీఎం చంద్రబాబు ఈ సబ్సిడీ మొత్తాన్ని అందించారు. ఏడాదికి 3 సిలిండర్లు ఇచ్చేందుకు అయ్యే రూ.2,684 కోట్ల ఖర్చుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
మొదటి ఉచిత సిలిండర్‌కు అయ్యే ఖర్చు రూ.894 కోట్లు పెట్రోలియం సంస్థలకు అందించింది. దీపం-2 పథకంలో భాగంగా ప్రతి 4 నెలలకు ఒక సిలిండర్ చొప్పున ప్రభుత్వం పేద ప్రజలకు అందించనుంది. 3 విడతల్లో ప్రభుత్వం 3 గ్యాస్ సిలిండర్లకు అయ్యే ఖర్చు సొమ్మును విడుదల చేయనుంది. 29వ తేదీ నుంచి ప్రభుత్వం ఈ పథకం కింద గ్యాస్ బుక్ చేసుకునే అవకాశాన్ని లబ్దిదారులకు కల్పించింది. గ్యాస్ సిలిండర్ అందిన 48 గంటల్లో లబ్ధిదారులు సిలిండర్‌కు వెచ్చించిన సొమ్ము వారి ఖాతాలో జమ కానుంది.