CM Chandrababu Review on Seasonal Health Issues:రాష్ట్రంలో వ్యవస్థలన్నీ గాడి తప్పాయని, ఐదేళ్ల విధ్వంసానికి ప్రజలు బలవుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సీజనల్ వ్యాధులపై సచివాలయంలో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖతో పాటు మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. సీజనల్ వ్యాధుల విషయంలో ముందు నుంచే అధికారులు చర్యలు తీసుకోవాలని, ఇప్పుడు చర్యలకు దిగితే పూర్తి ఫలితాలు రావని సీఎం అన్నారు.
ఆయా శాఖల్లో 2014 నుంచి 2019 వరకు నాటి టీడీపీ పాలనలో అనుసరించిన ఉత్తమ విధానాలు అన్నీ మళ్లీ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన సమీక్షలో సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకున్న చర్యలపై అధికారులు సీఎంకు వివరించారు. మలేరియా, డెంగ్యూ నివారణకు కార్యాచరణ అమలు చేస్తున్నామని, ఫీవర్ కేసులు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామని, హైరిస్క్ కేసులపై ప్రత్యేక ఫోకస్ పెట్టామని అధికారులు వివరించారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాకు అస్వస్థత! - పెరుగుతున్న డయేరియా కేసులు - Diarrhea in Joint Anantapur
డెంగ్యూ, చికున్‌గున్యాకు ర్యాపిడ్ టెస్ట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉందని అన్నారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు రాష్ట్రంలో 60 డయారియా కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం 6 గ్రామాల్లో 35 డయేరియా యాక్టివ్ కేసులు ఉన్నాయని వివరించారు. ఈ సీజన్లో 9మంది డయేరియాతో చనిపోయారని తెలిపారు. కలుషిత తాగునీరు వల్లే వీరంతా డయేరియా బారిన పడి చనిపోయారని అధికారులు వివరించారు. గ్రామాలు, పట్టణాల్లో కలుషిత తాగునీరు, పారిశుధ్య లోపం, దోమల నివారణకు చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, వాటిపై ఇప్పటికే తగు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందని సీఎం అభిప్రాయపడ్డారు.