CM Chandrababu Review on Roads in AP :రాష్ట్రంలో రోడ్లపై ఎక్కడా గుంతలు కనిపించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే పాత చంద్రబాబును చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. రోడ్లు, భవనాల శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం దారుణంగా ఉన్న రోడ్ల మరమ్మతుల కోసం నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. టెండర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేసి పనులు ప్రారంభించాలన్నారు. రెండు నెలల్లో రాష్ట్రంలోని గుంతలన్నీ పూడ్చాలని తేల్చి చెప్పారు.
రహదారులకు వరద కష్టం - రాష్ట్రవ్యాప్తంగా 5,921 కి.మీ. ధ్వంసం - Roads Destroyed in ap
రోడ్ల మరమ్మతులకు నిధులు విడుదల :రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి, వివిధ ప్రాజెక్టుల స్థితిగతులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వరదల వల్ల దెబ్బతిన్న 4,565 కిలోమీటర్ల రోడ్ల మరమ్మతులకు రూ. 186 కోట్లు, వివిధ జిల్లాల్లో రోడ్లపై గుంతలు పూడ్చడం కోసం రూ. 290 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. దెబ్బతిన్న రహదారుల నష్టాన్ని డ్రోన్, లైడార్ సాంకేతిక సహాయంతో అంచనా వేసి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. వర్షాలు తగ్గిన వెంటనే మరమ్మతు చేపట్టాలని ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో రూ. 65 వేల కోట్లతో జరుగుతున్న జాతీయ రహదారుల పనులను కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ వేగంగా పూర్తయ్యేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి 3 నెలలకూ ఎంత పని పూర్తి చేయగలమో మదింపు చేసుకుని పనుల్ని పరుగులు పెట్టించాలన్నారు.