CM Chandrababu on Revenue Earning Departments: సరికొత్త విధానాలతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆదాయార్జన శాఖలపై సీఎం సమీక్ష నిర్వహించారు. పన్ను ఎగవేతలు లేకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. అలా అని వ్యాపారులపై వేధింపులు వద్దని హెచ్చరిచారు. ఆదాయార్జన శాఖల్లో పనితీరు మెరుగుపడాలని సూచించారు. ఫలితాలు కనిపించేలా కార్యాచరణ ఉండాలని స్పష్టం చేశారు.
రొటీన్‌గా పనిచేస్తే ఫలితాలు రావు: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్ధికంగా కుదేలైన రాష్ట్రం మళ్లీ కోలుకుని అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వంలోని ఆదాయార్జన శాఖలు ఉత్తమ ఫలితాలు రాబట్టాలని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ఖజానాకు రాబడులు పెంచేందుకు సరికొత్త ఆలోచనలు చేయాలని సీఎం చెప్పారు. రాష్ట్రాన్ని ఆర్ధిక కష్టాల్లోంచి బయట పడేసేందుకు సమర్థవంత చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సాధారణ పనితీరుతో, సాధారణ లక్ష్యాలతో రొటీన్‌గా పనిచేస్తే ఫలితాలు రావని, వినూత్న ఆలోచనలతో పని చేయాలని సీఎం అన్నారు.
టెక్నాలజీ వాడకం ద్వారా రెవెన్యూ ఆర్జనలో లోపాలను సరిదిద్ది ఆదాయం పెంచాలని సీఎం సూచించారు. వాణిజ్య పన్నుల విభాగంలో పన్ను ఎగవేతలపై అధికారులు చెప్పిన అంశాలపై సీఎం స్పందించారు. పన్ను ఎగవేతకు పాల్పడకుండా చూడాలన్నారు. అలా అని వ్యాపారులను వేధింపులకు గురి చేయవద్దని సీఎం సూచించారు. వనరులు, ఆదాయ వృద్ధిపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధి పనులకు ఆర్థిక వనరులు ఎంతో కీలకమని దీన్ని దృష్టిలో పెట్టుకుని రోజువారీ ప్రోగ్రెస్ చూపేలా ఆదాయార్జన శాఖల్లో అధికారులు పనిచేయాలని సీఎం సూచించారు.
నా తపనంతా రాష్ట్రం కోసమే:గత ప్రభుత్వ విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయని, ఆదాయం కోసం ప్రజలపై అదనంగా భారం మోపలేమని, ఆదాయార్జనలో మరింత మెరుగైన ఫలితాలు సాధించడం మినహా మరొక మార్గం లేదని సీఎం అన్నారు. కేంద్రం నుంచి నిధుల విషయంలో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని, 16వ ఆర్ధిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగారియాను కలిసి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి వివరించానని, ఈ తపనంతా రాష్ట్రం కోసమేనని సీఎం అన్నారు. అధికారులు కూడా దీన్ని అర్థం చేసుకుని పనిచేయాలని సీఎం సూచించారు.